కొత్తగూడెం క్రైం, జనవరి 2 : నిషేధించిన చైనా మాంజాను కొందరు అక్రమంగా విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రామవరం ప్రాంతంలో కృష్ణారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకొని గొంతు కోసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగితోజు శివప్రసాద్, ఎస్సైలు బి.పురుషోత్తం, ఎస్కే.మస్తాన్లు తమ సిబ్బందితో చైనా మాంజాల విక్రయాలపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
పలువురు విక్రయదారులపై కేసు నమోదు చేశారు. పవన్ టాయ్స్ దుకాణంలో 30 బండిళ్ల చైనా మాంజా, పది ప్యాకెట్ల దారం రోల్స్, పవన్ జనరల్ మర్చంట్స్లో 14 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చైనా మాంజాతో మనుషులకే కాకుండా పక్షి జాతికి సైతం ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానిని నిషేధించినట్లు పేర్కొన్నారు.