పల్లె పోరు పరిపూర్ణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు బుధవారం నాటి ఆఖరి విడతతో విజయవంతంగా ముగిశాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమైనట్లయింది. ఇక, ఈ నెల 22న జరగాల్సిన నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం లాంఛనమే కానుంది. భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో బుధవారం జరిగిన పోలింగ్ 85.23 శాతంగా నమోదైంది. భద్రాద్రి జిల్లాలో గడిచిన రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం. అలాగే, ఖమ్మం జిల్లాలోనూ తుది విడతలో 88.84 శాతం పోలింగ్ నమోదైంది.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 17 : మూడో దశ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగియడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె పోరు పరిపమాప్తమైంది. విజయం కోసం అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డి తమ అభ్యర్థులకు మద్దతుగా నిలిచాయి. గ్రామీణ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. అన్ని ఎన్నికల్లో కలిసి సాగుతున్న కాంగ్రెస్, సీపీఐలు బలాబలాలు నిరూపించుకోవడం కోసం చివరి వరకూ కుస్తీ పడ్డాయి. భద్రాద్రి జిల్లాలో మూడో విడతలో భాగంగా లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో బుధవారం తుది విడత పోలింగ్ జరిగింది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సరళిని పర్యవేక్షించారు.
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో 156 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎస్టీ రిజర్వేషన్ పేరిట జూలూరుపాడు మండలంలోని ఓ పంచాయతీ ప్రజలు కోర్టుకు వెళ్లడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. మిగిలిన 155 పంచాయతీలకుగాను పది పంచాయతీలకు నామినేషన్ల నాటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలి ఉన్న 145 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 1,75,074 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,48,230 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.67 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.
‘ఖమ్మం’లో 88.84 శాతం పోలింగ్
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి (సింగరేణి), ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 168 పంచాయతీలకు, 1,372 వార్డుల స్థానాలకు బుధవారం తుది విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,43,928 మంది ఓటర్లకుగాను 2,16,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 88.84 శాతం పోలింగ్ నమోదైంది. తల్లాడ మండలం పినపాక జిల్లా పరిషత్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఏన్కూరు మండలం మేడిపల్లి పంచాయతీలోని కొత్త మేడిపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.
విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులతో చర్చించారు. తమకు రేషన్ కార్డులు; జనన, మరణ ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని గ్రామస్తులు అధికారులకు వివరించారు. దీంతో వాటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ చివరి విడతలో 190 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, 361 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు, 1,372 వార్డు స్థానాలకు బుధవారం నాటి ఆఖరి విడతలో ఎన్నికలు జరిగాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు.