భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి రాష్ట్ర సర్కార్ చేస్తున్న ‘బడిబాట’ ఏమాత్రం ఫలితం చూపించడం లేదనే చెప్పాలి.
ఫ్లెక్సీలతో వీధుల వెంట ర్యాలీలు నిర్వహించడం తప్ప విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మన ఊరు-మన బడి పేరుతో పాఠశాలలను తీర్చిదిద్దింది. అక్కడక్కడ నిలిచిపోయిన నిర్మాణ పనులను సైతం పూర్తి చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,323 పాఠశాలలు ఉండగా.. పదో తరగతి వరకు 283 పాఠశాలలు ఉన్నాయి. ఇవికాక ఇంటర్మీడియట్ వరకు 40 కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను సరిగా పట్టించుకోకపోవడం వల్లనే పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్‌కే తల్లిదండ్రుల మొగ్గు..
బడిబాట పేరుతో ర్యాలీలు చేసి చేతులు దులుపుకోవడంతో పేద విద్యార్థులు సైతం ప్రైవేటు స్కూల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించకుండా మొక్కుబడి ర్యాలీలు చేసి వచ్చినవారే మన వాళ్లు అనుకోవడం వల్ల ఎక్కువ శాతం విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు మొత్తం 108 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ల్యాబ్‌కు ఉపయోగించే గదిని ఎంఆర్సీకి ఉపయోగిస్తున్నారు.
విద్యార్థులందరికీ కలిసి ఒకటే టాయిలెట్ ఉంది. ఆవరణ అంతా గడ్డిమొలిచినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆళ్లపల్లి మండలం మర్కోడు హైస్కూల్లో ఒకటే టాయిలెట్.. గదులు సరిపడా లేవు.. దీంతో అక్కడి నుంచి పిల్లలు మణుగూరు, కొత్తగూడెం ప్రైవేటు స్కూల్స్‌లో చదవాల్సిన పరిస్థితి. చర్ల, దుమ్ముగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో విద్యార్థులు ప్రైవేటు చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్తున్నారు.
పుస్తకాలు వచ్చినా ఇంకా కొరతే..
సర్కారు లెక్కల్లో మాత్రం వంద శాతం పుస్తకాలు ఇచ్చామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ఇంకా కొరత ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది భద్రాద్రి జిల్లాలో 1,323 పాఠశాలలకు గాను 5,08,400 పుస్తకాలు అవసరం ఉండగా.. ఇప్పటివరకు 4,37,149 పుస్తకాలు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇంకా 52,300 పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హిందీ, తెలుగు, పర్యావరణ పుస్తకాలు రావాల్సి ఉంది. దీంతోపాటు ఈ ఏడాది ముందస్తుగానే యూనిఫాంలు పాఠశాలలకు చేరుతాయని చెబుతున్నా ఇప్పటివరకు ఒక జత దుస్తులను కుట్టినట్లు తెలుస్తున్నది. 62,532 మందికి గాను 52,256 దుస్తులను స్టిచ్చింగ్ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో జత ఇవ్వాల్సి ఉంది.
తనిఖీలకే పరిమితమైన ఎంఈవోలు..
హైస్కూళ్లలో పనిచేసే హెచ్ఎంలు 23 మంది ఎంఈవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా ప్రైమరీ పాఠశాలలకే పరిమితమవుతున్నారు. రెగ్యులర్ ఎంఈవోలు లేక హెచ్ఎంలే రెండుచోట్ల పనిచేయాల్సి వస్తున్నది. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో ఎంఆర్సీ భవనాలు లేక హైస్కూల్లోనే ఎంఆర్‌సీలను నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ తరగతి గదుల సమస్య ఉంది. ఎంఈవోలు పాఠశాలల తనిఖీతోనే సమయం సరిపోతుండడంతో హైస్కూళ్లలో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సౌకర్యాలు సరిగా లేవు..
ప్రైవేటు పాఠశాలల్లో మాదిరి సర్కార్ బడుల్లో కూడా పిల్లలకు సకల వసతులు కల్పించాలి. దూరం నుంచి వచ్చేవారికి బస్సు సౌకర్యం ఉండాలి. హాస్టల్ కూడా ఉంటే బాగుంటుంది. దూరం నుంచి రాలేక పిల్లలు బయట హాస్టళ్లలో ఉంటున్నారు. లేదంటే గురుకులాల్లో చదివిస్తున్నారు.
– కొమరం వెంకటకృష్ణ, మర్కోడు, ఆళ్లపల్లి మండలం
రెగ్యులర్ ఎంఈవోలు లేరు..
ఎప్పటి నుంచో ఎంఈవోల సమస్య ఉంది. రెగ్యులర్ ఎంఈవోలు లేరు.. ఉన్నవారితోనే నడిపిస్తున్నాం. టెస్టు పుస్తకాలు అన్ని స్కూళ్లకు పంపించాం. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఒక జత యూనిఫాం సిద్ధం చేసి పంపించాం. స్కూల్స్ తెరవగానే విద్యార్థులకు అందజేస్తాం. పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను త్వరలో పూర్తిచేస్తాం. బడిబాటలో భాగంగా గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.
– వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం