తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ‘ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం రాష్ట్రంలో పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని, మీ పార్టీ నాయకుడు రాజీవ్‌గాంధీపై మీకు ప్రేమ ఉంటే.. మీ పార్టీ కార్యాలయాల్లో ఆయన నిలువెత్తు విగ్రహాలు పెట్టుకోవాలని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని.. మరే విగ్రహాన్ని పెట్టినా ఊరుకోబోమని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు కేసీఆర్ అలుపెరుగకుండా పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఖమ్మం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు రేవంత్ తీరుపై మండిపడ్డారు. సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకాలు చేసి నిరసన వ్యక్తం చేశాయి.
– ఖమ్మం, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మణుగూరు టౌన్, సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. హైదరాబాద్ సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మణుగూరు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాయ పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత అజెండా ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మలిదశ ఉద్యమంలో 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల తీరుతో అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ తల్లి కంటే రాజీవ్‌గాంధీ గొప్పవాడా? రాజీవ్‌గాంధీ తెలంగాణ ప్రాంతానికి ఏం చేశాడని అతడి విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్ పాలకులు తెలంగాణ రాష్ర్టానికి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగ్గిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, అడపా అప్పారావు, ముత్యం బాబు, ముద్దంగుల కృష్ణ, బొలిశెట్టి నవీన్, తురక రామకోటి, లక్ష్మణ్, బోశెట్టి రవిప్రసాద్, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అశ్వారావుపేట/ దమ్మపేట, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్, దమ్మపేట మండలం ముష్టిబండలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2029 ఎన్నికల తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఇవ్వలేదని, కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్నామని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోగా.. దబాయింపు చర్యలకు పాల్పడుతూ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసమే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తప్ప ఆయనపై ఎలాంటి ప్రేమ లేదని ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, పార్టీ మండల కార్యదర్శి వెంకన్నబాబు, పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, దమ్మపేట బీఆర్ఎస్ మండల కార్యదర్శి దొడ్డా రమేశ్, జిల్లా శిశు సంక్షేమ మాజీ కోఆర్డినేటర్ తూతా నాగమణి, ఉపసర్పంచ్ దారా యుగంధర్, సీనియర్ నాయకులు అంకత ఉమామహేశ్వరరావు, వేంపాటి భరత్, మాజీ సర్పంచ్‌లు ఉయ్యాల చినవెంకటేశ్వరరావు, తూతా రామకృష్ణ, పాకనాటి శ్రీను, దొడ్డా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.