ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారంరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరామర్శ కొరవడిందని, రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులపై కనీసం పలకరించిన పాపానపోలేదని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం వచ్చిన వార్తకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆదివారం ఖమ్మంజిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క వెళ్లి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తన అధికారిక పర్యటన షెడ్యూల్లో చింతకాని మండల పర్యటన కానీ, ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించే అంశం కానీ లేకపోయినప్పటికీ ఆదివారం ఖమ్మంజిల్లా పర్యటనకు వస్తూనే ఆగమేఘాల మీద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.
రైతు ప్రభాకర్ తల్లిదండ్రులు, ప్రభాకర్ భార్య, కుమార్తె, కుమారును భట్టి ఓదార్చారు. ప్రభాకర్ జూలై 1వ తేదీన ఆత్మహత్య చేసుకోగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరామర్శ కరువైందని, ప్రభాకర్ మరణంతో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ తండ్రి వీరభద్రయ్య పడుతున్న ఆవేదనను ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం సవివరంగా ప్రచురించింది. అధికార పార్టీకి చెందిన నేతలెవరూ ప్రభాకర్ కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభాకర్ కుటుంబం పడుతున్న గోసను చూసే ప్రయత్నం చేయకపోవడంపై వచ్చిన కథనంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటివారైనా సరే సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భట్టి విక్రమార్క అనంతరం ప్రభాకర్ మృతి కేసులో నిందితుడిగా ఉన్న ఆదే గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు కూరపాటి కిషోర్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల నగదు అందించారు.
ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించాలని బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ శనివారం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఎంపిక చేసింది.ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ప్రభాకర్ కుటుంబసభ్యులతోపాటు రెవెన్యూ, పోలీస్ అధికారులకు పర్యటనపై ముందస్తు సమాచారం అందించారు. ఉదయం 9:30 గంటలకు గ్రామానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంకాగా డిప్యూటీ సీఎం వస్తున్నారని కొంత సమయం వేచి ఉండాలని పోలీసులు సూచించడంతో దాదాపు రెండుగంటల పాటు వారు పార్టీ కార్యాలయంలో నిరీక్షించారు. మల్లు భట్టి విక్రమార్క పరామర్శ కొనసాగుతుండడంతో బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తాతా మధుసూదన్, లింగాల కమల్‌రాజు, సండ్ర వెంకటవీరయ్య, పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.