భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో తదుపరి ప్రలోభాల కార్యాచరణపై అభ్యర్థులు, పార్టీల నాయకులు దృష్టి పెట్టారు. ఇక, తొలి విడత పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఉన్న ఎనిమిది మండలాల్లో గురువారం పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే కేటాయించిన ఎన్నికల సిబ్బంది బుధవారం ఆయా సెంటర్లకు చేరుకుంటారు. 1,428 పోలింగ్ కేంద్రాల్లో 1,713 మంది పీవోలను, 2,295 మంది సిబ్బందిని నియమించారు. ఇప్పటికే ఆయా అధికారులకు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తోపాటు ఎన్నికల పరిశీలకులు కూడా విధుల గురించి వివరించారు. టీ పోల్ యాప్‌లో పోలింగ్ శాతాన్ని అప్లోడ్ చేయాలన్నారు.
మూడో విడతకు నామినేషన్ల ఉపసంహరణ
రెండు విడతల ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో మూడో విడత నామినేషన్ల పర్వం కూడా ఉపసంహరణ దశకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు ఉపసంహరణ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. జూలూరుపాడు మండలంలో 23 పంచాయతీలకుగాను రెండు జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఒక పంచాయతీకి ఎన్నిక జరగడం లేదు. 20 పంచాయతీలకు గాను 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 188 వార్డులకుగాను 46 ఏకగ్రీవమయ్యాయి. 315 మంది పోటీలో ఉన్నారు.
ఇల్లెందులో 29 జీపీలకుగాను రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27 పంచాయతీలకు గాను 98 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 274 వార్డులకుగాను 51 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 223 వార్డులకుగాను 588 మంది పోటీలో ఉన్నారు. గుండాలలో 11 పంచాయతీలకుగాను రెండు జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 9 జీపీల్లో 41 మంది బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 96 వార్డులకుగాను 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 వార్డులకుగాను 249 మంది పోటీలో ఉన్నారు. సుజాతనగర్లో 13 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 12 జీపీల్లో 31 మంది బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 110 వార్డులకుగాను 30 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80లో 169 మంది పోటీలో ఉన్నారు. లక్ష్మీదేవిపల్లిలో 31 పంచాయతీలకుగాను మూడు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 28 పంచాయతీలకు 75 మంది పోటీలో ఉన్నారు. ఇదే మండలంలో 260 వార్డులకు గాను 39 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 221 వార్డుల్లో 531 మంది పోటీ చేస్తున్నారు. ఆళ్లపల్లిలో 12 పంచాయతీలకు గాను సర్పంచ్ స్థానానికి 43 మంది, 90 వార్డులకు 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టేకులపల్లిలో 36 పంచాయతీలకుగాను 112 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇదే మండలంలో 312 వార్డులకు గాను 68 ఏకగ్రీవమయ్యాయి. 541 మంది బరిలో ఉన్నారు.