పంటలు దిగుబడి రావాలంటే ఎరువులు తప్పనిసరి. అయితే ఆ ఎరువులు కొందామంటే దొరకడం లేదు. ప్రస్తుతం రైతన్నలు సాగుచేస్తున్న పత్తి, మిరప, వరి తదితర పంటలకు ఎరువులు అత్యవసరం. అయితే పంటలకు సరిపడా ఎరువులను అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా యూరియా కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తున్నది.
అక్కడక్కడా అరకొరగా ప్రభుత్వం అందిస్తున్న ఎరువులను దక్కించుకునేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని మరీ వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలు, ఎరువుల గోడౌన్ల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. గత కొన్నిరోజులుగా వర్షంలో తడుస్తూనే క్యూలో నిల్చొంటున్నారు. పొద్దంతా పడిగాపులు కాసినా కొందరికి ఒకటీ రెండు బస్తాలు దక్కుతుండగా.. మరికొందరికి ఎదురుచూపులే మిగిలిపోతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ స్పందించి సరిపడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో యూరియా కొరతను తీర్చండి
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం,ఆగస్టు 19: తెలంగాణలో యూరియా కొరతను తీర్చాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ బాల సుమన్‌లతో కలిసి ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు వారు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను పార్లమెంటులోని ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందించారు. కీలకమైన సమయంలో ఎరువుల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు.
రోజంతా సొసైటీ వద్దే..
చండ్రుగొండ, ఆగస్టు 19: మండలంలోని గానుగపాడు సహకార సంఘం కార్యాలయం వద్ద మంగళవారం రైతులు యూరియా కోసం రోజంతా క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి రెండు కట్టలు మాత్రమే ఇవ్వడంతో వ్యవసాయం ఎలా చేయాలని రైతులు వాపోయారు. పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ స్పందించి సరిపడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.
పాల్వంచలో రెండో రోజూ బారులు.. రైతులకు తప్పని తిప్పలు
పాల్వంచ రూరల్, ఆగస్టు 19: పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద రైతులు రెండో రోజు మంగళవారమూ బారులుతీరారు. రోజంతా క్యూలో నిలబడక తప్పలేదు. సోమవారం వర్షంలో సైతం లైన్లో నిలబడి విసుగెత్తిన కొందరు రైతులు వెనుతిరిగిపోయిన విషయం విదితమే. మంగళవారం కూడా రోడ్డు వరకు క్యూ కట్టారు. ముందస్తుగా వారి ఆధారపత్రాలు తీసుకుని ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఎరువులకు సంబంధించిన టోకెన్లు ఇచ్చి పంపించారు. ఉదయం ఏడు గంటలకే వచ్చిన రైతులు మధ్యాహ్నం మూడు గంటల వరకు నిరీక్షించారు. 30 కిలోమీటర్ల నుంచి కూడా రైతులు ఎరువుల కోసం వచ్చారు. స్టాకు ఉన్నంత వరకు 120 మందికి ఎరువులు ఇచ్చిన అధికారులు మిగతా రైతుల ఆధార్ జిరాక్స్‌లు తీసుకొని స్టాకు వచ్చాక రావాలని పంపించారు.
తల్లాడ సొసైటీలో టోకెన్లు..
తల్లాడ, ఆగస్టు 19: తల్లాడ సొసైటీకి 900 యూరియా కట్టలు వచ్చాయని తెలుసుకున్న రైతులు సోమవారం తెల్లవారుజామునే కేంద్రానికి 700 మందికి పైగా చేరుకున్నారు. వ్యవసాయ అధికారులు, సొసైటీ నిర్వాహకులు వారందరికీ ఒక్కొక్కటి చొప్పున సోమవారమే టోకెన్లు అందించారు. అనంతరం కొద్దిమందికి యూరియాను కూడా పంపిణీ చేశారు. మిగిలిన రైతులు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిల్చొన్నారు. థంబ్ (వేలిముద్ర) వేయాలనే నిబంధనతో అధికారులు కాలయాపన చేశారు. పెద్దసంఖ్యలో వచ్చిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక నానా అవస్థ పడ్డారు. ప్రస్తుత తరుణంలో పంటలకు యూరియాను అందించకపోతే.. కొద్దిరోజుల తర్వాత అందించినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.
సాయంత్రం దాకా ఉన్నా దక్కలే..
దుమ్ముగూడెం, ఆగస్టు 19: ఎరువుల కోసం దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయానికి వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాసినా కొందరికే యూరియా బస్తాలు దక్కడంతో మిగిలిన రైతులు అసహనంతో వెనుదిరిగారు. సోమవారం సుమారు 30 మంది రైతులు తమ పట్టా పాస్‌పుస్తకాలను క్యూలో పెట్టడంతో వారికి మాత్రమే సొసైటీ అధికారులు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. స్టాకు లేకపోవడంతో మిగిలిన వారికి మొండిచేయి చూపించారు. ఈ సందర్భంగా తమ సంఘ నాయకులతో అక్కడకు చేరుకున్న ఏఎస్పీ నేత సోంది మల్లు దొర.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మానుకుని కార్యాలయం వద్దే కూర్చున్నా చివరకు యూరియా లేదని పంపించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు.
మూడో రోజూ వర్షంలోనే..
ఇల్లెందు, ఆగస్టు 19: ఇల్లెందు మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్ద రైతులు యూరియా కోసం గత మూడ్రోజులుగా వర్షంలోనే పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా రోజూ ఉదయం రావడం సాయంత్రం వరకు ఉండి ఎరువుల స్టాక్ రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే లోడ్ వస్తుందని అధికారులు చెప్పడంతో మూడ్రోజులుగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గోడౌన్ వద్ద వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు.. తీరా సాయంత్రం వరకు కూడా లోడ్ రాకపోవడంతో చేసేదేమీలేక ఇంటిముఖం పడుతున్నారు. మంగళవారం సైతం ఉదయం వచ్చి సాయంత్రం వరకు మార్కెట్ యార్డులో పడికాపులు కాశారు. వ్యవసాయ పనులు వదులుకొని తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
20 రోజులుగా తిరుగుతున్నా..
గత 20రోజులుగా యూరియా కోసం దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. మంగళవారం కూడా వ్యవసాయ పనులు మానుకుని సొసైటీ వద్ద సాయంత్రం వరకు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. స్టాకు లేదని చెప్పి పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆడుకుంటోంది. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి రాదు. బీఆర్ఎస్ హయాంలో ఎరువుల కొరతే లేదు.
-సోయం బాబూరావు, రైతు, దుమ్ముగూడెం
ఒక్క కట్ట కూడా దొరకలేదు..
వ్యవసాయ పనులు వదులుకుని దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచియున్నాను. క్యూలో నిల్చోవడమే తప్ప నా వంతు వచ్చేసరికి ఒక కట్ట యూరియా కూడా దక్కలేదు. స్టాకు అయిపోయిందని సొసైటీ సిబ్బంది చెప్పడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగాను. పంటలకు యూరియా ఎలానో అర్థంకావడం లేదు.
-పాయం గంగరాజు, రైతు, దుమ్ముగూడెం