ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 17: బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరేందుకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి కోర్సులపై అనాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఇంటర్మీడియట్ అనంతరం ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఎంసెట్-2023లో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులకు ఆదివారం సీట్లు అలాట్మెంట్ అయ్యాయి. ఏయే కళాశాలల్లోని ఏయే కోర్సుల్లో సీట్ల కేటాయింపు జరిగిందో అనే విషయం జేఎన్టీయూహెచ్ నుంచి సంబంధిత విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు వెళ్లాయి. సంబంధిత కళాశాలలకు కూడా జాబితా వెళ్లింది. సీట్ల అలాట్మెంట్ వివరాలు www. tseamcet.nic.in వెబ్సైట్లోనూ ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో జిల్లాలో ఉన్న ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. సీట్ల కేటాయింపులో అత్యధిక కళాశాలల్లో కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు భర్తీ కాలేదు. విద్యార్థులకు అలాట్ అయిన కళాశాలల్లో ఈ నెల 22లోగా వాళ్లు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
సగం సీట్లు కూడా నిండలే..
ఇంటర్ పూర్తి చేసిన అనంతరం డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్‌కి గతంలో ఉన్న క్రేజ్ గత నాలుగైదేళ్లుగా తగ్గుతూ రాగా ఈ విద్యా సంవత్సరం మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఎంసెట్ రాసిన విద్యార్థులు 7 వేల మంది వరకు ఉంది. వీరిలో దాదాపు 2 వేల మంది వరకు ఆంధ్రా ప్రాంత విద్యార్థులే. ఖమ్మం జిల్లాలోని 8 కళాశాలల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కొత్తగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిల్లో 2,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్లోనే 60 శాతానికిపైగా సీట్లు ఉన్నాయి. ఆదివారం ప్రకటించిన సీట్ల కేటాయింపులో జిల్లాలో కేవలం 1,100 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ సైన్స్‌తోపాటు కంప్యూటర్స్ అనుబంధంగా ఉన్న కోర్సులకు మాత్రమే విద్యార్థుల ఆదరణ అధికంగా ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ కోర్సులను విద్యార్థులు ఎంచుకున్నట్లు.. సీట్ల అలాట్మెంట్ ద్వారా స్పష్టమవుతోంది.
కంప్యూటర్ సైన్స్‌కే ఫస్ట్ ఫ్రియారిటీ..
ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి నుంచీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు వాటికి అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండేళ్లు మినహా కంప్యూటర్ సైన్స్‌కి ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా బీటెక్‌లో సీఎస్ఈ కోర్సుకి విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ కళాశాలలతో సంబంధం లేకుండా కంప్యూటర్ సైన్స్ సీట్లు పూర్తి స్థాయిలో నిండాయి. అది కొన్ని కళాశాలలకు ఆశాజనకంగా కనిపిస్తోంది. అన్ని కళాశాలల్లో కంప్యూటర్స్ సైన్స్ సీట్లు భర్తీ అయ్యాయంటే ఈ కోర్సుకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ కోర్సుని ఎంచుకున్నారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ కోర్సును ఎంచుకున్నప్పటికీ పెద్ద కళాశాలల్లోనూ సగం సీట్లు కూడా నిండలేదు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కోర్సుల వైపు విద్యార్థులు చూడనే లేదు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో కలిపి ఎలక్ట్రికల్‌లో ఇరవై సీట్లు, మెకానికల్‌లో ఐదు, సివిల్‌లో ఐదు సీట్లు కూడా నిండలేదు. జిల్లాలో అత్యధికంగా ఓ కళాశాలలో 304 సీట్లు భర్తీ కాగా మిగిలిన కళాశాలలో వందకిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఒక కళాశాలలో మాత్రం ఐదు సీట్లు మాత్రమే అలాట్మెంట్ అయ్యాయి.
22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం..
ఎంసెట్ మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 22లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ కళాశాల నచ్చకపోతే తొలుత రిపోర్ట్ చేసి రెండో విడతలో మరోసారి ఇంకో కళాశాల కోసం ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అయితే రెండో విడతలో విద్యార్థికి నచ్చిన కళాశాలలో సీటు అలాట్ అయితే మొదటి విడతలో వచ్చిన సీటు దానంతట అదే రద్దవుతుంది. ఒకవేళ రెండో విడతలో సీటు అలాట్ కాకపోతే మొదటి విడత సీటు అలాగే ఉండిపోతుంది. అలాకాకుండా విద్యార్థి తనకు మొదట అలాట్ అయిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా నేరుగా రెండో విడతకు వెళ్లాడనుకుంటే.. అక్కడ రెండో విడతలో సీటు అలాట్ కాకుంటే.. మొదటి విడతలో వచ్చిన సీటుకు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఉండడు కాబట్టి అది రద్దవుతుంది. దీంతో విద్యార్థికి ఏ దశలోనూ సీటు లభించే అవకాశం ఉండదు. అయితే, ఈ నెల 24 నుంచి రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు.