ముదిగొండ, డిసెంబర్ 12: శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెసోళ్లు పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. పండ్రేగుపల్లి, చిరుమర్రి గ్రామాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరఫున శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పల్లెలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నాయో తేడా గమనించాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ఎక్కడా తగ్గదన్నారు. పెన్షన్ రూ.4 వేలు, ప్రతి మహిళకు ఆర్థిక సహాయంతోపాటు హామీలు ఇచ్చి వాటి అమలులో బొక్కబోర్లా పడ్డారని అన్నారు. తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 96 వేల పెళ్లిళ్లు జరిగాయ, అయితే 96 వేల తులాల బంగారం ప్రజలకు బాకీ ఉన్నారని వారు గుర్తు చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం బెదిరింపులకు పాల్పడుతున్నారని, మీ బెదిరింపులకు బీఆర్ఎస్ దడవదన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయం మేరకు పని చేయాలని, లేదంటే చర్యలు తప్పవన్నారు. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో రెండు మూడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని ప్రకటించి.. తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు ప్రకటించడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సామినేని హరిప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, బంక మల్లయ్య, పాము సిల్వరాజు, కిరణ్ పాల్గొన్నారు.