సత్తుపల్లి, ఫిబ్రవరి 3 : ఆసరా పథకం ద్వారా పింఛన్లను అందజేస్తూ పేదల బతుకులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. ఆసరా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. భర్త మృతిచెందితే జీవిత భాగస్వామికి 57ఏండ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛను, ఆ లోపు వారికి వితంతు పింఛన్‌ను పక్షంరోజుల్లోనే మంజూరు చేయనున్నది. ప్రతి నెలా అలాంటి వారిని గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. భార్య ఆధార్‌కార్డుతోపాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేసింది. దీంతో పింఛన్లు పొందుతున్న ఖమ్మం జిల్లా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్‌తో జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఎంతోమంది జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, డయాలసిస్ రోగులు, బోదకాలు బాధితులు అనేక మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్ల రూపంలో రూ.2,016, రూ. 3016లను అందజేస్తున్నది. ఇంటిలో ఒక్కరికి మాత్రమే పింఛన్ అందిస్తుండగా, పింఛన్ పొందుతున్న లబ్ధిదారు మృతి చెందితే జీవిత భాగస్వామికి వితంతు, వృద్ధాప్య పింఛన్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు ఆసరా పింఛన్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆసరా పింఛన్ల నిబంధనలను సడలించింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భర్త మృతి చెందితే గతంలో భార్యకు పింఛన్ మంజూరు చేయలేదు. దీనివల్ల భర్త చనిపోయిన వారు పింఛన్ కోసం బాధపడాల్సి వచ్చేది. ప్రభుత్వం వీరి ఇబ్బందులను గుర్తించి చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పింఛన్ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వృద్ధాప్య పింఛన్‌దారు మృతిచెందితే అతడి భార్య తన ఆధార్‌కార్డుతోపాటు చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు ఫారానికి జత చేసి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో పురపాలక సంఘం కార్యాలయంలో బిల్ కలెక్టర్‌కు అందజేయాలి. దరఖాస్తును పరిశీలించిన అధికారులు వాటిని ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా 15రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. 57ఏండ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ అందజేస్తారు. ప్రతినెలా ఇలాంటి లబ్ధిదారులను గుర్తించి ప్రతి నెలా ఆసరా వెబ్సైట్లో అప్లోడు చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేయడంతో ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రతి నెలా 1,94,755 మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నది. వీరిలో వృద్ధాప్య 75,802, వితంతు 72,986, దివ్యాంగులు 29,289, గీత కార్మికులు 3,361, చేనేత కార్మికులు 461, బీడి కార్మికులు 2, ఒంటరి మహిళలు 8689, హెచ్ఐవీ బాధితులు 2803, పైలేరియా బాధితులు 1422 మంది ఉన్నారు. దివ్యాంగులకు రూ.3,016, మిగతా వారికి రూ.2016 చొప్పున ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తున్నది.