వైరాటౌన్, ఆగస్టు 16 : మూడు విడతల్లో 22,37,848 మంది రైతులకు రూ.17,933 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన రైతులకు నాల్గవ విడత ఎప్పుడు విడుదల చేస్తారనేది దానిపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారని, ఇది సరైన విధానం కాదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
వైరాలోని బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులు అందిస్తామని రైతులను పిలిచి చెక్కులు ఇవ్వకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారన్నారు. సీతారామ ప్రాజెక్టును 2026, ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ఏ ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.687 కోట్ల నిధులు మిగిలిన భూ సేకరణ పరిహారం చెల్లింపులకు కూడా సరిపోవని, సీఎం హామీ ప్రకారం రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే అవసరమైన రూ.8 వేల కోట్లు గ్రీన్ చానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ, సాగర్ ఎడమ కాల్వ లింక్ కెనాల్, రాజీవ్ సాగర్‌కు భూములు ఇచ్చిన రైతులకు కనీసం పరిహారం కూడా ప్రకటించలేదన్నారు. వైరా నియోజకవర్గంపై సీఎం వరాలు కురిపిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసినా ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. సమావేశంలో వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, రైతు సంఘం పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పైడిపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
వైరాకు వరాలేవి?
కారేపల్లి, ఆగస్టు 16 : తొలిసారిగా వైరా నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో వరాలు ప్రకటిస్తారని, అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని ఎదురుచూసినా.. ఎలాంటి హామీ చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌసుద్దీన్ అన్నారు.
మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు వెనుకబాటుకు గురైన వైరా నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చేస్తారని, వరాలు కురిపిస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారన్నారు. కనీసం మున్సిపాలిటీ అభివృద్ధికి, రిజర్వాయర్ చుట్టూ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి, విలీన గ్రామాల్లో అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ మణికొండ నాగేశ్వరరావు, నాయకులు ఖలీలుల్లా ఖాన్, సద్దాం, ఫిరోజ్, కొణిదల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.