
యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలి
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
భద్రాద్రి జిల్లాలో పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హాజరైన ప్రభుత్వ విప్రేగా కాంతారావు, ఎంపీ కవిత
కరకగూడెం/ పినపాక, డిసెంబర్ 26 : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక మండలాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ కవితతో కలిసి పర్యటించారు. చొప్పాల-గొల్లగూడెం, మోతె-బర్లగూడెం గ్రామాల మధ్య వాగులపై వంతెనల నిర్మాణం, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతులపై చిన్నచూపు చూస్తున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కరకగూడెం మండలంలోని చొప్పాల- గొల్లగూడెం గ్రామాల మధ్య ముకట్టివాగుపై పీఎంజీఎస్‌వై నిధులు రూ.2.60 కోట్లతో నిర్మించనున్న వంతెన, మోతె – బర్లగూడెం గ్రామాల మధ్య పెద్దవాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించే వంతెన నిర్మాణ పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి మంత్రి అజయ్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం నుంచి వెంకటేశ్వరపురం వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ.3.11 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మారుమూల గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో వాగులపై వంతెనలను నిర్మించి అనేక చిన్నచిన్న గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్షలను సాకారం చేయడం సీఎం కేసీఆర్ సారథ్యంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతులపై చిన్నచూపు చూస్తున్నదని, ఎట్టిపరిస్థితుల్లోనూ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరగదని వివరించారు. రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, కలెక్టర్ అనుదీప్, మణుగూరు ఏఎస్పీ శబరీష్, పంచాయతీరాజ్ సీఈ సీతారాములు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్నిశాఖల డీఈలు, ఏఈలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ : ఎంపీ మాలోత్ కవిత
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపి ఆర్థికంగా ఎదగాలని కోరారు.
ఇరత పంటల వైపు మొగ్గు చూపాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై చిన్నచూపు చూస్తున్నదని, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతులు ఇతర పంటలను సాగు చేసి ఎక్కువ లాభాలు పొందాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ సహకారంతో నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని స్పష్టం చేశారు.
ఏజెన్సీ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ : జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
మారుమూల గ్రామాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. గూడేల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తున్నారని తెలిపారు.
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ అనుదీప్
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధిలో జిల్లా ముందజలో ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీలో జిల్లా వందశాతం పూర్తి చేయడం శుభపరిణామమన్నారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.