ఖమ్మం, ఏప్రిల్ 20: ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని అన్నారు. ముస్లింల పవిత్రమాసమైన రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. కేసీఆర్‌ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనపైనే ఉందని అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంసృతిని సీఎం కేసీఆర్ మొదలుపెట్టారని గుర్తుచేశారు.
ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందుకోసం ఈ ఎనిమిదేళ్లలో వేల కోట్లు వెచ్చిందన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. తెలంగాణ వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.53 కోట్లు గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా దాని నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకలను ఏటా అధికారికంగా నిర్వహిస్తోందని, ఏటా రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తోందని తెలిపారు. పేదింటి ముస్లిం యువతుల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం షాదీముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 సాయాన్ని అందిస్తోందని గుర్తుచేశారు. శాంతియుత సమాజం కోసం ముస్లింలు చేస్తున్న ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పగడాల నాగరాజు, ఫాతిమా, మహమూది, ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, తాజుద్దీన్, జహీర్‌అలీ, అష్రిఫ్, షకీనా, ఖమర్, షౌకత్ అలీ, మక్బుల్, ముక్తార్, నాగుల్‌మీరా, షంషుద్దీన్, ఇషాక్, ఫరీద్ఖాద్రి, సలీమ్ అహ్మద్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.