నెలలో 15రోజులు జ్వరం, మోయలేని భారం, వాపులు, నీరసం, సొంత పనులకు మాత్రమే పరిమితమయ్యే దయనీయ దుస్థితి పైలేరియా(బోదకాలు) బాధితులది. ఈ భయంకర వ్యాధి నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అంతేకాదు బాధితులకు అండగా నిలుస్తున్నది. పైలేరియా రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నది. ఈ ఏడాది జిల్లాలోని 14 లక్షల మందికి 35 లక్షల డీఈసీ(డైయిథైల్కార్బమజైన్) పైలేరియా నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నది. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు సిబ్బందిని ఇంటింటికీ పంపించి దగ్గరుండి మరీ మాత్రలు వేయిస్తున్నది. వీటితోపాటు ఆల్బెండజోల్, ఐవర్‌మెక్టిన్ మాత్రలను కూడా పంపిణీ చేస్తున్నది. పైలేరియా బాధితులకు రూ.2 వేలు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం అందరికీ నివారణ మందులను పంపిణీ చేస్తుండడంతో ప్రజానీకం హర్షిస్తున్నది.
– కూసుమంచి, ఆగస్టు 17
కూసుమంచి, ఆగస్టు 17 : ఖమ్మం జిల్ల్ల్లావ్యాప్తంగా 14 లక్షల మందికి 10 రోజులపాటు పైలేరియా నివారణ మందులను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ పంపిణీ చేస్తున్నది. వాటిల్లో 35,87,960 పైలేరియా మాత్రలు, 14 లక్షల ఆల్బెండజోల్ మాత్రలు, 40,18,515 ఐవర్‌మెక్టిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. ఇళ్లు, పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు ఇలా అందరికీ పంపిణీ చేయడమే కాకుండా వాటిని వేసుకునేలా చూస్తున్నారు. దశాబ్దాల తరబడి ఇబ్బంది పడుతున్న పైలేరియా బాధితులను ఎవ్వరూ పట్టించుకోలేదు. నెలలో 15 రోజులు మంచానపడి ఏ పనులకూ పోలేని దుస్థితిలో మోయలేని భారాన్ని గుండెల్లో దాచుకొన్న బాధితులను తొలిసారిగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. నెలకు రూ.2,000 పింఛన్ ఇస్తూ ఆదుకొంటున్నారు. భవిష్యత్తులో ఈ మహమ్మారి ఇతరులకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మందులను పంపిణీ చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 33 పీహెచ్‌సీల్లో సుమారు 14 లక్షల మంది అర్హత గల వారికి డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో 3,776 మంది బాధితులు
ఖమ్మం జిల్లాలో 3,776 మంది పైలేరియా బాధితులు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా 1,249 మందికి పైలేరియా పింఛన్ మంజూరు కాగా మిగిలిన 2,527 మంది ఇప్పటికే వివిధ రకాల ఇతర పింఛన్లు అందుకుంటున్నారు. పైలేరియా బాధితులను గ్రేడ్లుగా విభజించి కొత్తగా నమోదైన వారికి కూడా ఆన్లైన్ విధానంలో పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఒక్క పాలేరులోనే 1,850 మంది బాధితులు ఉండగా తిరుమలాయపాలెం మండలంలో అత్యధికంగా 966 మంది ఉన్నారు. రిజర్వాయర్ నీటి నిల్వలో దోమల కారణంగా ఈ ప్రాంతం వారికి ఎక్కువగా ఈ వ్యాధి వస్తున్నదని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా చర్యలు చేపడుతున్నది. భవిష్యత్తు తరాల వారికి పైలేరియా రాకుండా మందుల పంపిణీని ఒక ఉద్యమంలా చేపట్టింది. పీహెచ్‌సీల పరిధిలోని ఆశ కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి మందులను వేస్తున్నారు. పైలేరియా కాళ్లకు మాత్రమే వస్తుందనుకుంటాం. కానీ శరీరంలోని కాళ్లు, చేతులు, మర్మాంగాలకు కూడా వస్తుంది. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు, 5 సంవత్సరాలలోపు మూడు అడుగుల కన్నా ఎత్తు తక్కువ ఉన్నవారికి, బాలింతలకు ఈ మందులు ఇవ్వడం లేదు. ఖాళీ కడుపుతో కూడా మాత్రలు వేసుకోరాదు.
పైలేరియా లక్షణాలు..
పైలేరియా బాధితులకు తరచూ జ్వరం రావడం, ఆయాసం, శోషనాళాలు పాడైపోవడం, రక్త ప్రసరణ సరిగా లేక కాళ్లు చేతులు వాపులు రావడం, చర్మంపై పుండ్లు నీరు కారడం, మర్మావయవాలు పాడుకావడం, దురద, గజ్జలు, చంకల్లో బిళ్లలు కట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. మురుగునీటిలో పెరిగే క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల ఒకరి నుంచి మరొకరికి పైలేరియా వ్యాప్తి చెందుతుంది.
నివారణ చర్యలు..
పైలేరియా రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా డీఈసీ మందులు వేసుకోవాలి. వ్యాధికారక దోమలు వ్యాప్తి చెందకుండా అరికట్టాలి. బోధవ్యాధికి తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి. దోమతెరలు వాడాలి. డీఈసీ మందులు వేసుకున్న వారిలో కొందరికి, వికారం, తలనొప్పి, మత్తు, ఒళ్లునొప్పులు, దురదలు లాంటి లక్షణాలు ఉంటాయి. రెండ్రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. వ్యాధి వచ్చిన వారు నిత్యం నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, తడి లేకుండా పొడి దుస్తులతో తుడుచుకోవాలి. ఏదైనా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాయాలి. ప్రతిరోజూ కాళ్లకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కాలివేళ్లు పాదాలు పైకి ఎత్తడం, దింపడం చేయరాదు. గుండెజబ్బు ఉన్నవారు, జ్వరం వచ్చినప్పుడు వ్యాయామం చేయకూడదు.
20 ఏండ్లుగా బాధపడుతున్నా..
కాలు విపరీతమైన బరువుగా ఉంటుంది. అప్పుడప్పుడు పుండ్లు కూడా అవుతాయి. గత 20 సంవత్సరాలుగా బోదకాలుతో బాధపడుతున్నా. పనులకు పోలేను.. పిడుగురాళ్ల నుంచి ముగ్గును తీసుకొచ్చి రిక్షాలో గ్రామాలు తిరిగి అమ్ముకొంటున్నాను. జీవనం సాగడం కష్టంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నారు.
– అట్టూరి లక్ష్మారెడ్డి, పాలేరు
ఇంటింటికీ మందుల పంపిణీ
జిల్లావ్యాప్తంగా పైలేరియా, ఆల్బెండజోల్, ఐవర్‌మెక్టిన్ మందులను ఈ నెల 12 నుంచి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 58శాతం వరకు పూర్తి చేశాం. 22వ తేదీ వరకు వందశాతం పూర్తిచేస్తాం.. ఇంకా మిగిలిపోతే వారికి తర్వాత మూడ్రోజులు ప్రత్యేకంగా వేస్తాం. వయస్సు, ఎత్తు ప్రకారం డోస్ వేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 33 పీహెచ్‌సీల్లో 5,167 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 517 మంది అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మందులు వేసుకోవాలి.
– డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్