ఖమ్మం వ్యవసాయం, జూలై 30 : పంట రుణాల తీసుకున్న రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేయగా, జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నిధుల విడుదలను ప్రారంభించారు. మొత్తం మూడు విడతలుగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన తొలివిడతగా రూ.లక్షలోపు రుణాలకు సంబంధించి 57,857 మంది రైతులకు రూ.258,25,75,452 విడుదల చేసింది. వాటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. రెండోవిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల రుణాలు తీసుకున్న 33,942 మందికి రూ.262,50,56,893 కోట్ల రుణమాఫీ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రెండు విడతలు కలిపి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 91,799 మంది రైతులకు రూ.520,76,32,345 రుణమాఫీ జరిగింది.
రెండోవిడత రుణమాఫీ నిధుల విడుదల ప్రక్రియను రైతులు వీక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 21 రైతువేదికల్లో ప్రత్యేక ప్రొజెక్టర్ ఏర్పాటు చేసిన వ్యవసాయశాఖ రైతులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. రూ.1.50 లక్షలకు పైగా పంట రుణాలు తీసుకున్న రైతులకు మరికొద్ది రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రఘునాథపాలెం, జూలై 30 : రైతు రుణమాఫీ రెండోవిడత ప్రక్రియలో భాగంగా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన మహిళా రైతు బాదావత్ శైలజ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చెక్కు అందుకున్నారు.. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రుణమాఫీకి లబ్ధిదారురాలిగా ఉన్న శైలజకు సీఎం స్వయంగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.