ఖమ్మం : కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపి ఆధ్వర్యంలోని కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థఐన విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కుట్రలు చేస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.శివాజీ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా టీఎస్ఎన్పీడీసీఎల్ గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపి ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారని ఇదే పద్దతిలో విద్యుత్ రంగాన్ని అంబానీ, అదానీలకు దారాదత్తం చేసేందుకు విద్యుత్ చట్టాలను రూపొందించి ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ రంగానికి బీజేపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తూ జిల్లాల వారిగా ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నామన్నారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లో జెన్కో భవన్లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సంబంధించి భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో అసోషియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామేశ్వర్ శెట్టి, టీఎస్ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, కంపెనీ కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో అధ్యక్షులు సంపత్‌కుమార్, కార్యాదర్శి బి,రవి, అసోసియుట్ అధ్యక్షులు గోపికృష్ణ, జెన్కో అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు బాబునాయక్, యల్లంపల్లి రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.