కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 సర్వేలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఈఎల్తోపాటు గౌరవ వేతనం కూడా కేంద్రం చెల్లించనుండడంతో డిమాండ్ అధికంగా ఉంది. దీంతో టీచర్లు కూడా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. సర్వే విధులు దక్కించుకునేందుకు కొందరు ఉపాధ్యాయులు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కానుక రూపంలో సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు కూడా సీనియారిటీకి ప్రాధాన్యమివ్వకుండా తమ ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వెళ్లి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు సమర్పిన్నారు. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవాలంటూ స్పష్టం చేస్తున్నారు. మే నెలలో ఇళ్ల గుర్తింపు, వచ్చే ఏడాది ఫిబ్రవరి జనాభా లెక్కల సర్వే కోసం భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,805 మంది ఎన్యూమరేటర్ల, 312 మంది సూపర్వైజర్లను నియమించాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలో వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న జనగణన -2027 సర్వేకు ఉపాధ్యాయుల్లో అమితాసక్తి నెలకొంది. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయుల (ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు)కు కేంద్ర ప్రభుత్వం సుమారు నెల రోజుల ఈఎల్స్ (ఎర్న్ లీవ్స్-సంపాదిత సెలవులు)తోపాటు గౌరవ వేతనం ఇవ్వనుంది. మే నెలలో మొదటి సర్వేలో ఇళ్ల గుర్తింపును చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జనాభా లెక్కింపును చేపట్టనున్నారు. ఇందులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించనున్నారు. సర్వే జరిగేది వేసవి సెలవుల్లో కాబట్టి ఖాళీగా ఉండకుండా సర్వేలో పాల్గొనడానికి టీచర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్వే డ్యూటీకి ఎవరికి వారు సిఫార్సులు చేసుకుంటున్నారు.
తమకు డ్యూటీ వేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కానుకగా సమర్పించుకోవడానికి కూడా కొందరు ఉపాధ్యాయులు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీల కోసం రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, కొన్నిచోట్ల అర్హత లేని ఉపాధ్యాయులను సర్వేకు ఎంపిక చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎటువంటి సిఫార్సులు, పైరవీలకు తావు ఇవ్వకూడదని; సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తహసీల్దార్లకు వినతిపత్రాలు సైతం అందజేస్తున్నారు. ఈ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు ఎంపిక చేస్తున్నారు.
ఇష్టానుసారంగా ఎంపికలు..
జనగణన సర్వే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికను మండలాల్లో అధికారులు ఇష్టానుసారం చేపడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏ మండలానికి ఆ మండలంలోనే వీరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ బాధ్యతలను మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లకు, మండలాల్లో తహసీల్దార్లకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో స్థానిక బలం చూసుకొని కొందరు ఉపాధ్యాయులు అర్హత లేకున్నా డ్యూటీ కోసం ఎగబడుతున్నారు. రాజకీయ నాయకులు, మండల అధికారులను ప్రసన్నం చేసుకుంటూ విధుల కేటాయింపు కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాస్తవంగా ఎస్జీటీలను ఎన్యూమరేటర్లుగా; స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులను సూపర్వైజర్లుగా ఎంపిక చేయాల్సి ఉంది.
కానీ, కొందరు స్కూల్ అసిస్టెంట్లను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల విధులు, టెన్త్ పరీక్ష పేపర్లు వాల్యుయేషన్, ఇతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సీనియారిటీ ఆధారంగా నియమిస్తున్నారు. కానీ, జనగణన-2027 సర్వేకు ఎంపికల కోసం మండల అధికారులు, కమీషనర్లు పైరవీలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. వీరి ఎంపిక పూర్తయిన వెంటనే జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాకు 1,805 మంది ఎన్యూమరేటర్లు, 312 మంది సూపర్వైజర్ల నియామకానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అం దించారు. ఎంపిక ప్రక్రియ మండలస్థాయిలో తుది దశకు చేరుతోంది.
అతి త్వరలో చేపట్టనున్న జనగణన-2027 సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికలో అధికారులు పైరవీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయుల ఎంపికలో కనీసం సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే మండలస్థాయిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు కూడా ఇచ్చాం. ఎటువంటి సిఫార్సులకు ప్రాధాన్యమివ్వకుండా అధికారులు పారదర్శకంగా సర్వే సిబ్బందిని ఎంపిక చేయాలి.
-భూక్యా భాస్కరరావు, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, కొత్తగూడెం
జనగణన సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికలో టీచర్ల సీనియారిటీనే అధికారులు ప్రామాణికంగా తీసుకోవాలి. అర్హత లేని ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేయకూడదు. ఇప్పటి వరకు ఎన్నికల విధులు, టెన్త్ పరీక్ష పేపర్లు వాల్యూయేషన్ వంటి అనేక కార్యక్రమాలకు సీనియారిటీ ప్రకారంగానే ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. రాజకీయ పైరవీలకు తావు లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి సర్వే సిబ్బందిని ఎంపిక చేయాలి.
-మడివి కృష్ణారావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, అశ్వారావుపేట
ఎంఈవో కార్యాలయం నుంచి తమకు వచ్చిన జాబితా ఆధారంగానే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఎంపిక చేస్తున్నాం. వృద్ధులు ఎవరైనా సర్వే చేయలేమని చెబితే తర్వాత సీనియారిటీ ఉపాధ్యాయులకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇందులో ఉపాధ్యాయులు సందేహించాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతోంది. ఎంపికైన సర్వే ఉపాధ్యాయులు రెండు దఫాల్లో జనగణన-2027లో పాల్గొంటారు.
-బి.నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అశ్వారావుపేట