కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23 : సింగరేణి సంస్థలో నికర లాభాలపై 33 శాతం వాటా చెల్లించాలని, సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట సోమవారం సాయంత్రం నిరసన తెలిపిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం కార్మికులకు రూ.1,550 కోట్లు పంచగా.. మిగిలిన 67 శాతం రూ.3,150 కోట్లు సంస్థ డెవలప్మెంట్ కోసం వాడాలనే నిబంధన గతంలో ఎప్పుడూ లేదని, ఈసారి కొత్త విధానంతో కొంత ఆదాయాన్ని పక్కన పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడమే అవుతుందని, వెంటనే ప్రకటించిన మొత్తం లాభాల్లో నుంచి 33 శాతం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు, కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కార్మికులకు ఇస్తానన్న హామీలు ఒకటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు తుమ్మ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, సోనా, కొట్టి వెంకటేశ్వర్లు, వేముల ప్రసాద్‌బాబు, అంబుల వేణుగోపాల్, వసికర్ల కిరణ్‌కుమార్, కాగితపు విజయ్‌కుమార్, రాసూరి శంకర్, బూర్గుల రవికుమార్, కంచర్ల శ్రీనివాస్, సూరజ్, వెంకటేశ్వర్లు, కుమార్, పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.