కారేపల్లి, ఏప్రిల్ 23: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ ఖ్యాతి గడించిందని విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. రాబోయే మూడేళ్లపాటు పార్టీ శ్రేణులు ప్రజల మధ్యనే ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దూకుడుకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. సింగరేణి మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజానీకంతో కలిసి గాంధేయమార్గంలో స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమసారథి కేసీఆర్.. తరువాత ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. గడిచిన ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటున్నామని అన్నారు.
అధికారం చేపట్టిన 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అధోగతిపాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోందో మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకే అర్థంకాక బోరున విలపిస్తున్నారని ఎద్దేవాచేశారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు వంటివి కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు హైడ్రా పేరుతో పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలపై రేవంత్ సరారు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే యోచనలో ఉందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్‌ను గద్దె దింపేవరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తాతా మధు పిలుపునిచ్చారు. పార్టీ పాతికేళ్ల ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణపై ఆ సభలో పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని వివరించారు. సభకు బయలుదేరే ముందు అన్ని గ్రామాల్లోనూ గులాబీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తొలుత కారేపల్లిలో తేళ్ల రవివర్మ వివాహ వేడుకకు హాజరైన తాతా మధు.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెంకిట్యా తండా బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భాను భాసర్ను ఆయన ఇంటి వద్ద పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, పుల్లారావు, పిల్లి వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకట అప్పారావు, బత్తుల శ్రీనివాసరావు, రాందాస్‌నాయక్, జూపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.