ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 19: పాఠశాలల నిర్వహణకు కేటాయించిన నిధుల జమ, వినియోగం వివరాల సేకరణ వంటి కీలకమైన విభాగాల్లో పనిచేయాల్సిన సిబ్బంది లేక మూడు నెలలు కావస్తోంది. ఈ విభాగం ద్వారానే ఇటీవల సుమారు రూ.2 కోట్ల పాఠశాలల నిధులు దారి మళ్లిన విషయం విదితమే. విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా అభియాన్‌లో ఫైనాన్స్ విభాగంలో ఒప్పంద పద్ధతిన నియమించిన అకౌంటెంట్, ట్యాలీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు విధులకు గైర్హాజరవుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచాల్సిన విద్యాశాఖాధికారులు తీరిగ్గా ఇప్పుడు సిబ్బంది కావాలంటూ ఉన్నతాధికారులకు నివేదించారు.
ఫైనాన్స్ విభాగంలో పనిచేయాల్సిన అకౌంటెంట్, ట్యాలీ ఆపరేటర్ లేకపోవడంతో విద్యాశాఖలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని కేటాయించారు. ఫైనాన్స్ పరిశీలించాల్సిన విషయంలో అర్హత లేని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌కు విధులు అప్పగించారు. గతంలో అకౌంటెంట్‌గా పనిచేసిన ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా.. ట్యాలీ ఆపరేటర్‌గా చేసిన మహిళా ఉద్యోగి విధులకు గైర్హాజరవుతున్నారు. ఇదే విభాగంలో పనిచేసేందుకు భద్రాద్రి జిల్లా నుంచి కేటాయించిన ఒప్పంద ఉద్యోగి కొన్ని రోజులు ఆ సెక్షన్ విధులు నిర్వర్తించగా.. రాష్ట్ర ఉన్నతాధికారులే నేరుగా ఆ పోస్టు నుంచి తొలగించి విద్యాశాఖలో కొనసాగించాలని ఉత్తర్వులిచ్చారు.
సుమారు రూ.2 కోట్ల విద్యాశాఖ నిధులు దారి మళ్లించిన ఘటన విద్యాశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉన్నతాధికారులు ఈ అంశంపై శాఖాపరమైన విచారణతోపాటు విజిలెన్స్ విచారణ సైతం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విద్యాశాఖ అధికారితోపాటు ఫైనాన్స్ పర్యవేక్షణ అధికారికి షోకాజ్‌లు సైతం జారీ చేశారు. దీనిలో రెండు విడతల్లో రూ.1.10 కోట్లు వసూలు చేయగా.. మిగిలిన మొత్తాన్ని ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. విధుల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు తమ సంతకాలనే ఫోర్జరీ చేసినా గుర్తించలేకపోవడం, సంబంధిత సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగి కావడం, పర్యవేక్షణ లోపించడం వంటి కారణాలతోనే నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు.