ఖమ్మం రూరల్, జూలై 28 : గిరిజన పాఠశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అదే పాఠశాలలో చదువుతున్న సహా విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన భూక్య ప్రతిమ పదో తరగతి చదువుతుంది.
సోమవారం ఆమె పాఠశాలలో సాంఘిక శాస్త్రం కు సంబంధించిన ఎఫ్ఏ వన్ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కండ్లు తిరిగి కిందపడిపోయింది. గమనించిన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే వైద్య కోసం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విద్యార్థిని మృతి చెందింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థిని ప్రతిమ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.