మార్చి నెల మూడో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన పదిహేను రోజుల నుంచి దంచికొడుతున్నాయి. ఉదయం పది దాటకముందే భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాదచారులు, చిరువ్యాపారులు ఎండకు తాళలేక నెత్తిన రుమాళ్లు వేసుకుంటున్నారు. వృద్ధులు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఉపాధి హామీ కూలీలు తెల్లవారేసరికి పనుల స్థలాలకు చేరుకుంటున్నారు. ఎండల ధాటికి తట్టుకోలేక కొందరు ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలను దాటిపోయాయి. గడిచిన రెండు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినట్లు కన్పిస్తున్నప్పటికీ అంతకు వారం రోజుల క్రితం వరకూ పగటి వేళలోనే 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం, మార్చి 16
గడిచిన రెండు రోజులుగా జిల్లాలో చిత్రమైన వాతావరణం కన్పిస్తోంది. గత 15 రోజులుగా 30 నుంచి 33 డిగ్రీల వరకూ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి కూడా వేడి వాతావరణమే ఉండేది. కానీ రెండు రోజులుగా పగలు విపరీతమైన ఎండ కొడుతున్నప్పటికీ రాత్రి మాత్రం చల్లగాలులు వీస్తున్నాయి. అయితే, ఫిబ్రవరిలోనే తీవ్రరూపం దాల్చిన ఎండలు.. సగటున 30 డిగ్రీల వరకూ నమోదయ్యాయి.
మార్చి ప్రథమార్థంలోనే 33 డిగ్రీలు నమోదవుతుండడంతో రానున్న ఏప్రిల్, మే నెలల ఎండల తీవ్రత గురించి జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో పగటి వేళలో పనుల మీద బయటకు వచ్చే ప్రజలు నెత్తిన రుమాళ్లు కప్పుకుంటున్నారు. ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారులపై ప్రయాణాలు చేస్తున్న వారు హడలిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలోనే తలపై వస్ర్తాలు కప్పుకొని బయటకు వస్తున్నారు. ఎండలు ముదురుతుండడంతో శీతల పానీయల విక్రయాలు కూడా ఉపందుకుంటున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సుమారు 50 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలను తలచుకుంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా రాత్రి పూట వాతావరణం చల్లబడడం కూడా రానున్న ఎండల తీవ్రతకు సంకేతమేమోనని భావిస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రయాణాల కోసం బైకులకు బదులు ఆటోలు, బస్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే, ఆటోల్లో ప్రయాణించే వారు కూడా ఎండ వేడిమిని, వడగాడ్పులను తాళలేకపోతున్నారు. రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల కోసం రోడ్ల వెంట ఉన్న భారీ వృక్షాలు, చెట్లను నరికి వేయడంతో రహదారులపై ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో రహదారుల వెంట కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, చెరుకు రసం సహా ఇతర పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, విక్రయాలు పెరిగిపోయాయి.
ఇంకా రెండు నెలలు కాలం ఉన్నా ముందస్తుగా ఎండలు మండిపోతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వచ్చే రెండునెలలు ఇంకా ఎన్ని ఎండలు ఉంటాయో అని జనాలు భయపడుతున్నారు. అసలే బొగ్గు గనుల ప్రాంతం, అందులో పరిశ్రమలకు కేరాఫ్‌గా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఉండడంతో వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణశాఖ కూడా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతాయని చెబుతున్నది. 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదాలు ఉంటాయంటున్నారు.
వేసవికాలం వచ్చిందంటే చాలు డయాబెటిస్ రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఎండల్లో బయటకు వెళ్లినా వేడి ప్రదేశాల్లో ఉన్నా షుగర్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల డయాబెటిస్ రోగులు ఇంటికే పరిమితం కావాల్సి వస్తున్నది. అందులో వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎన్ని మందులు వాడినా వేడివల్ల షుగర్ అమాంతంగా పెరిగిపోతుంది. అరికాళ్ల మంటలు వచ్చి ఏసీలు లేకపోతే ఉండలేకపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యాధులబారిన ఉన్నవారు ఎండలు పెరిగిన కొద్దీ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ నీరు తాగడం, తినాల్సిన పండ్లు మాత్రమే తినడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండకు బయటకు వస్తే ప్రమాదంలో పడతారు. వృద్ధులది కూడా అదే పరిస్థితి. వారానికి ఒకసారైనా షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. అలసటకు గురికాకుండా చూసుకోవాలి.
-డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ మెడిసిన్, కొత్తగూడెం