ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 13: పదిహేను రోజుల క్రితం ఉప్పొంగిన మున్నేరు ఖమ్మం రూరల్ మండలంలోని అనేక గ్రామాలను ముంచెత్తింది. దీంతో దాని పరీవాహక ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి బయటికెళ్లారు. అయితే సాధారణ ప్రజల ఇళ్లతోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా మునిగిపోయాయి. దీంతో వాటిల్లోని విలువైన రికార్డులు నీటిలో తడిచిముద్దయ్యాయి.
ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ, ఈజీఎస్ కార్యాలయాల్లోని గదుల్లోకి రెండు అడుగుల మేర వరద వచ్చింది. దీంతో రికార్డులున్నీ వరద నీటిపాలయ్యాయి. దీంతో తడిచిన రికార్డులను, విలువైన పత్రాలను, ఫైళ్లను ఆయా కార్యాలయాల అధికారులు శుభ్రపరుస్తున్నారు.
కొన్నింటిని విడదీసి ఆరబెడుతున్నారు. ఇంకొన్ని పత్రాలు పూర్తిగా తడిచి పనికిరాకుండా పోయాయి. నిరుటి వరదల్లో కూడా ఐకేపీ, ఈజీఎస్, ఎంఈవో కార్యాలయాలు నీటమునిగిన విషయం విదితమే.
ఈ ఏడాది ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్లు, కుట్టు మిషన్లు సహా ఇతర అనేక వస్తువులు పూర్తి పాడయ్యాయి. సుమారు రూ.12 లక్షల పైగానే నష్టం వాటిల్లినట్లు అధికాకారులు అంచనా వేశారు. వీటితోకి తోడు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల యూనిఫామ్స్, క్లాత్లతోపాటు ఈజీఎస్ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఎంఈవో ఆఫీసులోని కంప్యూటర్, కీలక ఫైళ్లు తడిచిపోయాయి.