అశ్వారావుపేట/ దమ్మపేటరూరల్, మే 13 : చదువుతోపాటు ఆసక్తి గల రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. తద్వారా భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చని చెప్పారు. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఇక్కా ఫౌండేషన్… విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అసోసియేట్ డీన్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్, ఎస్సీ, ఎస్టీ సెల్ కో-ఆర్డినేటర్ కె.కోటేశ్వరరావు, డాక్టర్ ఎం.రాంప్రసాద్, డాక్టర్ ఐ.కృష్ణ తేజ, డాక్టర్ ఆర్.రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
పచ్చిరొట్ట పైర్ల సాగుతో నేలలో కర్బన పదార్థం వృద్ధి చెందుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్‌కుమార్ అన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల కార్యక్రమం డాక్టర్ శిరీష, డాక్టర్ జంబమ్మల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా హేమంత్‌కుమార్ మాట్లాడుతూ వేసవిలో జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లు చల్లుకుని పెరిగిన తరువాత భూమిలో కలియదున్నుకోవడం వలన కర్బనం పుష్కలంగా వృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా రైతులు మార్పు చెంది లాభదాయకమైన పద్ధతులను పాటించాలన్నారు. వరి సాగులో నేరుగా విత్తనాలను చల్లుకోవాలన్నారు. నీటిని ఆదా చేయడంతోపాటు కూలీల కొరతను అధిగమించవచ్చన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సందీప్, వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.