ఖమ్మం అర్బన్, మే 1 : జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టాల్సిన పదో తరగతి ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్‌గా పేరున్న ఖమ్మం జిల్లా పది ఫలితాల్లో 21వ స్థానానికి దిగజారడానికి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యార్థులు ఎక్కువగా తెలుగు, సైన్స్‌లో ఫెయిల్ అయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో అర్థమవుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు.
తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి నియామకాలు చేసినప్పటికీ సర్దుబాటు ఉపాధ్యాయుల డిప్యూటేషన్ మాత్రం రద్దు చేయలేదు. ఒక టీచర్ అవసరమైనచోట చాలా స్కూళ్లలో సర్దుబాటు టీచర్లు, నూతనంగా నియామకమైన టీచర్లు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారనేది స్పష్టమవుతున్నది. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాల్సిన అధికారులు ఆ స్థాయిలో అడుగులు వేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ధపా పరీక్షల్లో తెలుగులో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో తెలుగు 393, హిందీ 38, ఇంగ్లిష్ 111, గణితం 245, సైన్స్ 471, సోషల్ 104 మంది ఫెయిల్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది సైన్స్, తెలుగులోనే ఉన్నారు. ఫెయిలవుతున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు అందుకు కార్యాచరణ మాత్రం రూపొందించలేకపోతున్నారు.
ఎన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నా.. కలెక్టర్ పలుమార్లు సమావేశాలు నిర్వహించినా.. 10 స్కూళ్లలో 70 శాతంలోపే ఫలితాలు వచ్చాయంటే పర్యవేక్షణలో లోపం ఉన్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 92.78 శాతం ఉంటే.. జిల్లాలో రాష్ట్ర సగటు కంటే తక్కువ వచ్చిన స్కూళ్లు 124 వరకు ఉన్నాయి. పెనుబల్లి మండలంలో 14 స్కూళ్లలో 564 మందికి 557 మంది ఉత్తీర్ణత సాధించి 98.76 శాతంతో టాప్‌గా నిలిచింది. కొణిజర్ల మండలంలోని 16 స్కూళ్లలో 641 మందికి 520 మంది ఉత్తీర్ణత సాధించారు. 119 మంది ఫెయిల్ అయి 81.38 శాతంతో చివరన నిలిచింది.
జిల్లాలో ప్రభుత్వ 21, జిల్లా పరిషత్ 190, కేజీబీవీ 14.. మొత్తం 225 పాఠశాలలు ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో మాత్రం నూరు శాతం ఉత్తీర్ణత సాధించినవి కేవలం 65 పాఠశాలలే ఉన్నాయి. నూరు శాతం ఫలితాలు సాధించిన వాటిలో ప్రభుత్వ పాఠశాల 1, జిల్లా పరిషత్ స్కూళ్లు 61, కేజీబీవీలు 3 ఉన్నాయి. ప్రైవేట్, ఇతర యాజమాన్యాలున్న స్కూళ్లలో 105 స్కూళ్లు నూరు శాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలో 424 స్కూళ్లలో 170 స్కూళ్లు సెంట్ పర్సంట్ రిజల్ట్స్ నమోదు చేశాయి.