బోనకల్లు, మే 23 : పశువుల రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్లు-మధిర క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో 24×7 నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పశువులను రవాణా చేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని, అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నిబంధనలు విరుద్ధంగా అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పౌరులకు సూచించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకుని శాంతిభధ్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకు రావొద్దని కోరారు. సరిహద్దు చెక్ పోస్టుల తనిఖీలే కాకుండా జిల్లా కేంద్రంలో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారి వాహనాలు సీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.