ఏ ప్రభుత్వంలో లేని వింతలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. అసలే కిరాయిలు లేక నానా ఇబ్బందులు పడుతున్న వాహనదారులను స్టిక్కరింగ్ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నది రాష్ట్ర సర్కార్. వాహనాలు ఫిట్నెస్ సాధించాలంటే ఇక నుంచి ఐదు కంపెనీల స్టిక్కర్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది వాహనదారులపై పెనుభారంగా మారింది. కష్టపడి వాహనాల ఈఎంఐలు కట్టుకొని కుటుంబాలను పోషించుకుంటున్న తమను బాధపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
-చుంచుపల్లి, ఏప్రిల్ 8
వాహనాల ఫిట్నెస్ కోసం ఐదు కంపెనీల స్టిక్కర్లు తప్పనిసరి చేయడంతో రాష్ట్ర సర్కార్‌పై వాహనదారులు మండిపడుతున్నారు. ధరలు కూడా ఎక్కువగా పెంచడంతో నానా తంటాలు పడుతున్నారు. వాహనాల ఫిట్నెస్ కోసం స్టిక్కర్లు తప్పనిసరి.. అయితే గతంలో వాహనదారుడు బయట స్టిక్కరింగ్ చేయించుకొని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వద్దకు వాహనాన్ని తీసుకొచ్చి స్టిక్కర్లు, ఇతర పత్రాలను చూయించి రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు. కానీ, ఇప్పుడు కార్యాలయం వద్ద ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టర్ వద్దనే స్టిక్కరింగ్ చేయించుకోవాలని ప్రభుత్వమే నిర్ణయించింది. అంతేకాకుండా వారు కేటాయించిన డబ్బుతోనే వారు నిర్ణయించిన రుసుముతోనే స్టిక్కరింగ్ వేయించాలని నిబంధన పెట్టి వాహనదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. జీవో నంబర్ 60 పేరుతో రేవంత్‌రెడ్డి బంధువుకు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనాలకు స్టిక్కర్ వేసే కాంట్రాక్టు అప్పజెప్పినట్లు వినికిడి.
ప్రైవేట్ సంస్థ వాహనదారుడి నుంచి రిప్లెక్టింగ్ స్టిక్కర్ మీటర్ రూ.1,500 నుంచి రూ.2,900 వరకు వసూలు చేస్తున్నారు. అందుకు గాను రాష్ట్రంలో ఉన్న 56 రవాణా శాఖ కార్యాలయాల్లో వారి మనుషులను, ప్రైవేట్ సంస్థ వారి మనుషులను నియమించుకున్నారు. స్టిక్కరింగ్ వేసేవారికి కార్యాలయం వద్దనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహన సామర్థ్యాన్ని బట్టి బస్సులకు 3 వేల కిలోలు పైబడిన సరుకు రవాణా వాహనాలకు 7 నుంచి 10 వేల వరకు ఉంటోంది. ఉదాహరణకు బస్సులకు, లారీలకు, టిప్పర్లకు సుమారు రూ.10 వేలు ఉంటుంది. ప్యాసింజర్, ట్రాలీ ఆటోలకు రూ.1,500 నుంచి రూ.6 వేలు వరకు స్టిక్కర్లను వేసి వసూలు చేస్తున్నారు.
వాహనదారుల ఆగ్రహం
కుటుంబాన్ని ఎలాగోలా పోషించుకుంటూ వస్తున్న తమపై ఇంతలా స్టిక్కరింగ్ పేరుతో రక్తాన్ని పీల్చి డబ్బులు వసూలు చేయడం భావ్యం కాదంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బంధువులను పోషించడానికి రేవంత్‌రెడ్డి మా లాంటి పేదవారి కడుపుకొట్టడం సరికాదని వాపోతున్నారు. వారు సూచించిన ఏజెంట్ల వద్దకు, వారు చెప్పిన ధరలకే స్టిక్కరింగ్ వేయించుకుంటే తమకు వేలలో భారం పడుతోందని ఆవేదన చెందుతున్నారు.
గతంలో రూ.600కే చేసుకున్నాను..
ఇదే స్టిక్కరింగ్ మేము బయట చేయించుకుంటే రూ.600కే అయిపోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ వద్దనే స్టిక్కరింగ్ చేయించుకోవాలని నిబంధన పెట్టారు. దీనికి రూ.1,500 ఖర్చు అయ్యింది. ఇది మాకు భారంగా ఉంది. మరీ ఇంతగా ధరలు పెంచడం సరికాదు. మాకు నచ్చినచోట స్టిక్కరింగ్ చేయించుకునేలా అవకాశం కల్పించాలి. ఇంత డబ్బులు చెల్లించుకోవడం కష్టమే.
-సమ్మయ్య, టాటా మ్యాజిక్ వాహనదారుడు, చుంచుపల్లి