రఘునాథపాలెం, జూన్ 17: కేసీఆర్ సర్కారులో గిరిజనులకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. దీంతో వారు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులను పాలకులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రఘునాథపాలెం మండలంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. లచ్చిరాంతండా, దొనబండ, కేవీ బంజర, మంగ్యాతండ, మూలగూడెం, ఎన్వీ బంజర, జీకే బంజర గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రజబ్ అలీ నగర్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సీమాంధ్రుల పాలనలో గిరిజనులు దశాబ్దాలపాటు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయారని అన్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడ్డారని, ప్రత్యేక ప్రణాళికతో తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందించి వారికి ఆ భూములపై హక్కులు కల్పించిన ఘతన సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులందరికీ రైతుబంధును అమలు చేయనుండడం గొప్ప విషయమని అన్నారు. ఈ పట్టాలున్న గిరిజన రైతులు వ్యవసాయం చేసుకునేందుకు సాగునీటి కోసం బోర్లు వేసుకోవచ్చని, విద్యుత్ మీటర్లు పెట్టుకోవచ్చని అన్నారు. కానీ కొత్తగా అడవులను నరికి పోడు సాగు చేయవద్దని సూచించారు.
ఎన్నికల సమయంలో కొందరు ప్రదర్శించే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మవద్దని మంత్రి అజయ్ సూచించారు. మీ ప్రాంతాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వారికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా గిరివికాస్ పథకంలో భాగంగా మండలంలో ఏడుగురు గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో మంజూరైన వ్యవసాయ మోటార్లను మంత్రి పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు వీవీ అప్పారావు, విద్యాచందన, భుక్యా గౌరి, మాళోతు ప్రియాంక, అజ్మీరా వీరూనాయక్, గుత్తా రవికుమార్, మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు నర్సింహారావు, గుండా మనోహర్‌రెడ్డి, భుక్యా జీజా, బోడా శరత్, ధరావత్ జమున, మాళోతు బాబిచంద్, జర్పుల సక్రాం, బోడా ద్వాలీ, బోడా భాస్కర్, అజ్మీరా రవి, బోడా చిన్నా, నాన్యా తదితరులు పాల్గొన్నారు.