ఖమ్మం, జూన్ 19: రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. బచ్చు విజయ్‌కుమార్ సుడా చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలోని దోరేపల్లి ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విజయ్‌కుమార్ సన్మాన, అభినందన సభలో మంత్రి మాట్లాడారు. సమాజంలో 51 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాల్పిన అవసరం ఉందని అన్నారు. ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క కులానికో అన్ని పదవులూ కాకుండా అన్ని కులాలకూ సమానంగా పదవులు ఇవ్వడం, అవకాశాలు కల్పించడమే తన అభిమతమని అన్నారు.
2014 ఎన్నికల్లో తన గెలుపులో ప్రధాన భూమిక పోషించింది కాపులేనని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తనకు ఎల్లవేలలా అండగా ఉన్నారని గుర్తుచేశారు. ఇంకా కొన్ని కులాల వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారికి త్వరలోనే న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. తాను రాజకీయాలోకి వచ్చిన నుంచి బచ్చు విజయ్‌కుమార్ తనకు చిత్రగుప్తుడి పాత్ర పోషిస్తూనే ఉన్నాడని, తన స్ట్రెస్ అంతా అతడిపైనే ఉంచుతున్నానని అన్నారు. అయినప్పటికీ విజయ్‌కుమార్ ఎంతో ఓపికగా ఉంటూ తాను చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడని వివరించారు. తన బలగం తనతో ఉన్నంత వరకు తానకు ఓటమి లేదని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్ సీడ్స్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, మేయర్ నీరజ, మున్నూరు కాపు సంఘం నాయకులు, బీఆర్ఎస్ నేతలు, వివిధ సంఘాల బాధ్యులు పారా నాగేశ్వరరావు, పులిపాటి ప్రసాద్, పొన్నం వెంరటేశ్వరరావు, కొప్పు నరేశ్‌కుమార్, మెంతుల శ్రీశైలం, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, అమరగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.