ఖమ్మం, నవంబర్ 13: ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ‘ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, గ్రూప్ -3 పరీక్షలు’ తదితర అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గ్రూప్-3 పరీక్షలు పకాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాల్లో ప్రతి రోజూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం, కొనుగోళ్లు, తరలింపు అంశాలను పరిశీలించాలని సూచించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. తేమ చూడకుండా పత్తి కొనుగోలు జరుపవద్దని సూచించారు. పట్టణాల్లో సర్వే ప్రక్రియ కొంత నెమ్మదిగా జరుగుతున్నందున దీనిపై దృష్టి సారించి వేగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు సన్యాసయ్య, చందన్‌కుమార్ పాల్గొన్నారు.