ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 1: ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ బుధవారం ప్రారంభమైంది. పరీక్షలు జరుగుతుండగానే స్పాట్ నిర్వహించడం ఇదే తొలిసారి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ సబ్జెక్టుల్లో ఉత్తర్వులు అందుకున్న వారందరూ స్పాట్‌కు హాజరయ్యారు. అవసరమైన సంఖ్య కంటే అదనంగా ఎక్కువ మందికి విధులు కేటాయించడంతో అనారోగ్య కారణాలు ఉన్న వారికి మినహాయింపు కల్పించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లకు సహాయంగా ఉండాల్సిన స్పెషల్ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది.
ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం స్పాట్ విధుల నుంచి టీచర్లను క్యాన్సిల్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక.. ఎంఈవోలు ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్ల రిపోర్టును స్వీకరించారు. మూల్యాంకనం మధ్యాహ్నం తరువాత ప్రారంభమైంది. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా ఖమ్మం రూరల్ ఎంఈవో ఎం.శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. హాజరైన ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు.
మూల్యాంకనం ప్రక్రియలో సహాయ ఎగ్జామినర్లు ఎంత కీలకపాత్ర వహిస్తారో స్పెషల్ అసిస్టెంట్లు కూడా అదేస్థాయిలో కీలకపాత్ర వహిస్తారు. 300 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లకు విధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మూల్యాంకనం చేయడం కోసం ఏఈలకు పేపర్లు ఇచ్చేందుకు ఎస్జీటీలను స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. మరో 60 మంది వరకు స్పెషల్ అసిస్టెంట్లు అవసరమని అధికారులు గుర్తించారు. మూల్యాంకనానికి డీఈవో చైతన్యజైనీ క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియను కార్యాలయ సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావు, ఏసీ లక్ష్మీప్రసాద్, పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.