ఖమ్మం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : : సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం వేడుకను సోమవారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా, శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తమ ఆరాధ్య దైవం శ్రీరాముని పట్టాభిషేక తంతును భక్తులు కనులారా వీక్షించి తన్మయం పొందారు. రాజ లాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను తిలకించి భక్తజనం పరవశించింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారామచంద్రస్వామి కల్యాణం మరుసటిరోజు మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు వేడుకలు అత్యంత విజయవంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
మహా పట్టాభిషేకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని శ్రీరాముడు, సీతమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. తొలుత భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, ఈవో రమాదేవి, వేదపండితులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా వేదమంత్రాలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం ఇచ్చి వస్ర్తాలు, జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు. నూతన దంపతులైన శ్రీసీతారామచంద్రస్వామి వారి కి పట్టాభిషేక వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. స్వర్ణ సింహాసనాన్ని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసి శ్రీరాముడికి శాస్ర్తోక్తంగా పట్టాభిషేక తంతును నిర్వహించడంతో భక్తజనం పులకించింది.
సరిగ్గా పది గంటల నుంచి పట్టాభిషేక తంతు సాగగా ఆరాధన అనంతరం వేదస్వస్తితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి శ్రీరామ మహా పట్టాభిషేకం విశిష్టతను భక్తులకు వివరించిన తీరు ఆకట్టుకుంది. వేదాశీర్వచనం, అష్టోత్తర శతహారతి 108 వత్తులతో వెలిగించి భద్రాచలం శ్రీరామచంద్రప్రభువుకు సమర్పించడంతో మహా పట్టాభిషేకం సుసంపన్నమైంది. మహాపట్టాభిషేక కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్‌రావు పాల్గొన్నారు.