ఖమ్మం, జూన్ 4: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా తాను నిత్యం నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు తన కన్నతల్లి అంటే ఎంత ఇష్టమో.. నియోజకవర్గ ప్రజలు అన్నా అంతే ఇష్టమని అన్నారు. గెలిస్తే పొంగిపోయేది లేదని, ఓడితే కుంగిపోయేది లేదని అన్నారు. ఇకపై కూడా తాను నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి తరఫున ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తానని అన్నారు. వారి సమస్యల పరిషారం కోసం పోరాడుతానని అన్నారు. ఎంపీగా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేశానని, అవినీతికి ఆసారం, మచ్చలేకుండా సేవలందించానని గుర్తుచేశారు.
తనకు అన్ని విధాలా అండగా ఉండి ముందుకు నడిపించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు, తనకు ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. తన బలం, బలగం, ధైర్యం అన్నీ ప్రజలేనని స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో ఇకముందు కూడా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. వారి క్షేమం కోసం శ్రమిస్తానని అన్నారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, ఇకడున్న తన ప్రజల మధ్యనే ఉంటానని వివరించారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేరుగా తనకు చెప్పుకోవచ్చునని, ఇందుకోసం తన ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని, గడపగడపకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. ఖమ్మం స్థానం నుంచి గెలిచిన రఘురాంరెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.