వైరాటౌన్, నవంబర్ 9 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను దళారులకు అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తుందన్నారు. ఆయన వెంట డీఎస్వో చందన్‌కుమార్, సివిల్ సైప్లె అధికారులు ఉన్నారు.