– డీడబ్ల్యూఓ రామ్గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం రూరల్, అక్టోబర్ 16 : మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి కె.రామ్ గోపాల్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం ఐకెపి సమావేశపు ప్రాంగణంలో మండల ఐసిడిఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు జరిగాయి. ఎదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఆయా సెక్టార్లకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, కేంద్రాల పరిధిలోని గర్భిణీలు, చిన్నారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత డీడబ్ల్యుఓ, మున్సిపల్ కమిషనర్, సిడిపిఓ కమలాప్రియ, ఎంపీడీఓ కె.శ్రీదేవితో కలిసి గర్భిణీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. పూలు, పండ్లు, చీరే సారే, పసుపు కుంకుమలు అందించి ఆశీస్సులు అందజేశారు. చిన్నారులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు ఇతర వస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా రాంగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యంగా గర్భిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పుడుతారన్నారు. గర్భిణీలు నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్యారోగ్య సిబ్బందిచే పరీక్షలు చేయించుకోవాలని, వారి సలహాలు సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీలో నాణ్యమైన భోజనంతో పాటు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎంబి పాలెం, పీహెచ్సీ డాక్టర్, ఏపీఓ శ్రీదేవి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Khammam Rural : ‘మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు’