భద్రాచలం, మే 31 : గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగించే విధంగా గిరిజన మ్యూజియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్(మోట) న్యూఢిల్లీ వారు ప్రకటించిన రూ.కోటి నజరానా అందుకున్న పీవో.. యూనిట్ అధికారులకు శనివారం అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తన చాంబర్లో ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో తీర్చిదిద్దిన ట్రైబల్ మ్యూజియంను గత నెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి నుంచి సందర్శకులు, పర్యాటకులు మ్యూజియంలో ఆదివాసీ వంటకాలను రుచిచూస్తున్నారని ఆహ్లాదం పొందుతున్నారన్నారు. ఇటీవల సందర్శించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్కలు పాతతరం కళాఖండాలను చూసి అన్ని ఐటీడీఏల్లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారన్నారు.
కాగా.. శుక్రవారం హైదరాబాద్ తాజ్ బంజారాలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ న్యూఢిల్లీ వారు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌కు తనకు ఆహ్వానం అందిందని, అక్కడ గిరిజన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మ్యూజియం ఏర్పాటు, అభివృద్ధి తదితర విషయాల గురించి వివరించినట్లు చెప్పారు. మ్యూజియం అభివృద్ధి కోసం రూ.కోటి నజరాన ప్రకటించి తనను సత్కరించడం ఆనందంగా ఉందని పీవో పేర్కొన్నారు.