ఖమ్మం రూరల్, జూన్ 11 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి డివిజన్లో కొనసాగుతున్న పారిశుధ్య నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బారుగూడెం పెద్దతండా టీఎన్జీవోస్ కాలనీల్లో పర్యటించిన కమిషనర్ ఆయా కాలనీల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బంది, కార్మికులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి మున్సిపాలిటీ పరిధిలో 100 రోజుల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ నిర్వహణ ఇతర విభాగాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో అందుకు అనుకూలంగా పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతిరోజు ఒకటి లేదా రెండు ప్రాంతాలను ఎంపిక చేసి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం కార్మికులను అక్కడే మోహరించి అవసరమైన చోట జెసీబీలు, డోజర్లు, ఇతర యంత్రాల ద్వారా కాల్వలను శుభ్రం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Khammam Rural : పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక నజర్ : ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి