సంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలే కాదు.. కూరగాయలు సాగు చేసి అద్భుతాలు సాధిస్తున్నాడు సుజాతనగర్‌కు చెందిన రైతు రవి. చదివింది బీటెక్. కానీ భూమిపై మక్కువతో వ్యవసాయ రంగంలోకి వచ్చాడు.. ఇప్పటికే ఎన్నో రకాల పంటలు పండిస్తూ స్వయంగా వాటి విత్తన క్షేత్రాలు ఏర్పాటు చేశాడు.. విత్తనాల డిమాండ్‌ను బట్టి పొరుగు రాష్ర్టాలకూ సరఫరా చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.. ఏడున్నర ఎకరాల్లో సొరకాయ సాగు చేస్తూ పెట్టుబడి పోను ఏకంగా రూ.11 లక్షల ఆదాయం గడించి అబ్బురపరిచాడు. ఒకటికి పదిసార్లు సొర సాగు చేసి బాగా కాసిన మొక్కలను ఎంచుకుని స్వయంగా తానే విత్తనాలు సిద్ధం చేసుకోవడం విశేషం. అంతేకాదు ఆ విత్తనాలకు ‘ఆర్హెచ్ఎస్ వీనా’ అని నామకరణం చేశాడు. సస్యరక్షణ చర్యలపై అవగాహన ఉంటే ఏ పంట నుంచైనా అధిక లాభాలు సాధించవచ్చంటున్నాడు రైతు రవి. ఈ సందర్భంగా ‘వీనా’ సాగు విజయంపై ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ):విత్తనాలు మంచివైతే కాపు ఎవరైనా కాపిస్తారు. కాకుంటే వర్షాలు, వాతావరణం అనుకూలించాలి. కానీ ఈ రైతు అలా కాదు. విత్తనాలు ఆయనే తయారు చేస్తాడు. అధిక దిగుబడిని చూపిస్తాడు. ఆయన ఎవరో కాదు.. భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన మన్నేపల్లి రవి. ఆయన తన సాగు క్షేత్రంలో వ్యవసాయం చేయడమే కాదు.. విత్తనాలు తయారు చేసి తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగు రాష్ర్టాలకూ సరఫరా చేస్తున్నాడు. ‘ఇదీ.. తెలంగాణ రైతన్న దిగుబడి..’ అని నిరూపిస్తున్నాడు. కేవలం సొర సాగు మాత్రమే కాకుండా.. ఇంకా ఎన్నో రకాల విత్తనాలను సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది ఒక వీనా సొర విత్తనాలను ఏడున్నర ఎకరాల్లో సాగు చేసి రెండింతలు లాభాన్ని చూపించాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టడం, సకాలంలో మందులు చల్లడం, పాదుల వద్ద మట్టిపని చేయడం వంటివి చేస్తే ఎలాంటి పంటలోనైనా అధిక దిగుబడి సాధించవచ్చని అంటున్నాడు రైతు రవి.
ఎకరానికి 20 టన్నుల దిగుబడి..
రవి సేద్యం చేసిన ఏడున్నర ఎకరాల్లో వీనా సొరకాయలు ఇరగ కాశాయి. కాత అంటే అది మామూలు కాత కాదు.. ట్రాక్టర్లతో మార్కెట్‌కు తోలే అంత కాత. కోత కోస్తూ కూలీలు సైతం సంబుర పడే అంత కాత. ఎకరానికి 20 టన్నులు దిగుబడి. టన్నుకు సుమారు 1000 కాయలు వస్తాయి. మొత్తానికి ఏడున్నర ఎకరాలకు గాను రూ.3.50 లక్షలు మాత్రమే పెట్టుబడి అయింది. అంటే దాదాపు పెట్టుబడికి మించి ఆదాయం సొరతోట సమకూర్చి పెట్టింది. ఇంతటి స్థాయిలో కాత కాయడం ఇదే ప్రథమం అంటాడు రైతు రవి. విత్తనం తయారు చేసిన రైతే సాగు చేసి చూపిస్తే పలువురు రైతులు కూడా ఆదాయం వచ్చే పంటను వేసేందుకు ముందుకు వస్తారు. రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన చేసిన ప్రయత్నం సఫలమైంది. ఈ విత్తనం గతంలో ఉన్నా కాపు తెలియక రైతులు అంతగా ముందుకు రాలేదు. అయినా ఇతర రాష్ర్టాల్లో సొరను వేసి అక్కడి రైతులు అధిక దిగుబడిని సాధించారు.
వీనా విత్తనం ప్రత్యేకత ఇదీ..
రవి క్షేత్రంలో తయారైన వీనా సొర విత్తనం అన్ని సీజన్లలోనూ కాత కాస్తుంది. ఆకర్షణీయమైన రంగు, సైజుతో కాయలు ఉంటాయి. ఎక్కువ కాలంపాటు కాత కాస్తుంది. గింజ నాటిన 55 రోజుల్లో చెట్టు కాతకు వస్తుంది. ఆర్హెచ్ఎస్ వీనా పేరుతో రైతు రవి ఈ విత్తనం తయారు చేశాడు. ఈ కాయలు ఎక్కువ పొడవు ఉంటాయి. ఒక చెట్టుకు ఎక్కువ సంఖ్యలో కాయలు వస్తాయి.
సాగు వివరాలు ఇలా..
పంట విస్తీర్ణం: ఏడున్నర ఎకరాలు
పెట్టుబడి వ్యయం: రూ.3.50 లక్షలు
ఎకరానికి దిగుబడి: 20 టన్నులు
టన్నుకు కాయల సంఖ్య: 1000
విక్రయించగా వచ్చిన ఆదాయం: రూ.11 లక్షలు
పొరుగు రాష్ర్టాలకు మన విత్తనమే..
గులో మెళకువలు తెలిసినా సాగు చేసే విధానం కూడా తెలియాలి. ఇదే విషయం రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో పొలంలో పంటను వేసి చూపించాడు ఈ రైతు. అది మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గతంలో బెండ, చిక్కుడు, బీర, బీన్స్, టమాటా, పుచ్చ, మిర్చి వంటి పంటలను విత్తనాల తయారీ కోసం వేశాడు. మరికొంత సాగు చేస్తే అవి కూడా లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది కూడా సొరతోపాటు బెండ, బీన్స్, టమాటా కూడా వేసేందుకు సాగు క్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన తయారు చేసిన సొర విత్తనం తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగు రాష్ర్టాలకూ సరఫరా చేస్తున్నాడు. వీటిని సాగు చేయడం ద్వారా అక్కడి రైతులు కూడా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి..
సాగు చేసే విధానంలో ఎన్ని మార్పులొచ్చినా విత్తనాన్ని ఎంచుకునే విధానంలో ఆచితూచి అడుగు వేయాలి. వాతావరణ అనుకూల పరిస్థితులను గమనించాలి. ఒకవేళ అనుకూల సమయంలో సాగు చేయాల్సి వస్తే మంచి విత్తనాలను ఎంచుకోవాలి. ఇలా సాగు చేస్తే పెట్టుబడికి మించిన ఆదాయం వస్తుంది. ఎంతో ప్రత్యేక కలిగిన వీనా రకం విత్తనాలను మన తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాలకూ సరఫరా చేస్తున్నాను. మన విత్తనాలు మన దగ్గర నుంచే తయారు కావాలేనేది నా లక్ష్యం.
-మన్నేపల్లి రవి, హైబ్రీడ్ సీడ్ నిర్వాహకుడు