సత్తుపల్లి,చప్పుడు ఫిబ్రవరి 23: సత్తుపల్లి మండలంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. రేజర్ల, కొమ్మేపల్లి, లింగపాలెం ప్రభుత్వ, ప్రభుత్వేర భూముల్లో మట్టిని తవ్వి, అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ పొక్లెయిన్లు మట్టిని తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్ చేస్తున్నాయి. తవ్వకాలు జరిపే ప్రదేశానికి వాహనాలు వెళ్లేందుకు ఏకంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
అక్రమార్కులు ఒక టిప్పర్ మట్టికి డిమాండ్‌ను బట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు మట్టిని తరలిస్తున్నాయి. వాహనాలు వేగంగా నడుపుతుండడం, రోడ్డుపై మట్టి పెళ్లలు పడుతుండడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు సిండికేట్ ఏర్పడి మట్టి దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా మట్టి తోలకాలు తమ దృష్టికి రాలేదని, అనుమతులు లేకుండా మట్టి తోలకాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తవ్వకాలు సాగే ప్రదేశాలకు తమ సిబ్బందిని పంపించి విచారణ చేస్తామన్నారు.