కారేపల్లి, ఏప్రిల్ 04 : విద్య ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు, విద్యార్థులకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వైరా పట్టణంలో నూతనంగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు అనువైన స్థలాలను అధికారులతో కలిసి కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ముందుగా కే.వి.సి.ఎం కళాశాల, అనంతరం తెలంగాణ గురుకుల పాఠశాలలను సందర్శించి నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తారని దానికి అనుగుణంగా అనువైన స్థలం కోసం చూస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం ముఖ్యమని, ఇందులో భాగంగా మౌళిక వసతులు, ప్రభుత్వం ఆలోచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు అద్భుతమైన మౌలిక వసతులతో సౌకర్యవంతమైన భవనాలు నిర్మిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందన్నారు. క్రీడలు ఆడేందుకు వీలుగా విశాలమైన మైదానాలు, కోర్టుల ఏర్పాటుకు అనువైన స్థలంతో ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, వైరా తాసీల్దార్ శ్రీనివాసరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Collector Muzammil Khan : వైరాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన