ఖమ్మం అర్బన్, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా జడ్పీ డిప్యూటీ సీఈవో నాగపద్మజ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె కలెక్టర్ అనుదీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత ప్రమోషన్ల ప్రక్రియపై వివరాలు సేకరించారు. ఒకటి రెండు ఫైళ్లపై మాత్రమే సంతకాలు చేశారు. ఇన్చార్జి ఏడీ చావా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, దేవేందర్, యూసఫ్, ఏపీవో శ్రీనివాస్, ఏఎస్వో కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంవోగా ప్రవీణ్ నియామకం..
ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ మీడియా (సీఎంవో) కోఆర్డినేటర్‌గా బి.ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ డీఈవో నాగపద్మజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రస్తుతం చింతకాని మండలం ప్రొద్దుటూరు జడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. బయాలాజికల్ సైన్స్ డీఆర్పీగా పనిచేశారు. ఏడాదిపాటు ఫారిన్ సర్వీస్ కింద పనిచేయాలని డీఈవో ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ స్థానంలో శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసింది. అయితే డీఈవో కార్యాలయం నుంచి మరో వ్యక్తిని రికమండ్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్టుపై బుధవారం స్పష్టత రానున్నది.
జిల్లాలో నేడు సైట్ డైరెక్టర్ పర్యటన
రెండు జిల్లాల పరిశీలకులుగా నియమితులైన సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి బుధవారం నుంచి రెండు రోజులపాటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం కూసుమంచి మండలం కేజీబీవీ నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల తరఫున వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పలు నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు. రెసిడెన్షియల్ స్కూల్‌తో సహా వివిధ రకాల పాఠశాలలను సందర్శించిన తర్వాత మధ్యాహ్నం ఎంఈవోలతో ఖమ్మంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర అంశాల అమలుపై సమీక్ష చేపట్టనున్నారు. ఆమె రాత్రికి ఖమ్మంలోనే బస చేసి 7న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.