భద్రాచలం, ఏప్రిల్ 28: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ సందర్భంగా గురువారం రాత్రి రామయ్యకు నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత ఆలయం ప్రాంగణంలోని యాగశాలలో రథాంగ హోమం జరిపారు. రథానికి తెల్ల అన్నంతో బలిహరణం చేశారు. దృష్టికుంభం, అన్నం ఉంచి మంచి రాచ గుమ్మడికాయతో రథానికి దిష్టి తీశారు. అనంతరం సీతారామ, లక్ష్మణమూర్తులను రథంపై ఉంచి నివేదన చేశారు. రథంలో ఉన్న రామయ్యను చూసేందుకు భక్తులు రహదారులకు ఇరువైపులా బారులు తీరారు. స్వామివారి తిరువీథి సేవ తాతగుడి సెంటర్ వరకు కొనసాగింది. సీతారామ, లక్ష్మణ, హనుమ, భక్త శబరి వేషధారణలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. శ్రీరామ పునర్వసు దీక్షాపరుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు తమ ఆరాధ్యదైవానికి నారీకేళాలు, ండ్లు, హారతులు సమర్పించారు. అర్చకులు పాల్గొన్నారు.
శ్రీరామ పునర్వసు దీక్ష ముగింపు సందర్భంగా దీక్షాపరులతో భద్రాచలం సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో శుక్రవారం రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించారు. శుక్రవారం బేడా మండపంలో సీతారాముల నిత్య కల్యాణం ముగియగానే అదే వేదికపై రామచంద్రుడిని దివ్యాభరణాలతో అలంకరించి ఆసీనులను చేశారు. విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచన, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. రాజదండం, రాజ ముద్రిక, రాజఖడ్గం అలంకరించారు. శ్రీరామరాజ్యం వైభవాన్ని వేద పండితులు వివరించారు. సముద్ర జలాలను, నదీ జలాలను స్వామివారిపై ప్రోక్షించి, తరువాత భక్తులపై చల్లారు. పట్టాభిషేక స్వర్గను పఠించారు. పట్టాభిషేకం ఒక్క రాముడికి మాత్రమే జరిపిస్తారని అర్చకులు తెలిపారు.