కారేపల్లి, మార్చి 2: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సముచిత న్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం కారేపల్లికి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ మండల నాయకులు స్వాగతం పలికారు.
అనంతరం ఉద్యమ నాయకుడు జడల వెంకటేశ్వర్లు నివాసంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టాన్ని దేశం గర్వించే విధంగా మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారని గుర్తుచేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్లు వివరించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. పరిపాలనపరంగా రాష్ట్రం అంతా గందరగోళం, అగమ్యగోచరంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటాలు ఉధృతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు షేక్ గౌసుద్దీన్, డొంకెన రవీందర్, పుచ్చకాయల ఉదయ్‌కిరణ్, గంగరబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు.