కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు/ మణుగూరు టౌన్/ సత్తుపల్లి టౌన్, జూలై 5: యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. పే అప్ గ్రేడేషన్, పీఆర్పీ బకాయిల చెల్లింపులు చేయాలని సీఎంవోఏఐ సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. కొత్తగూడెం కార్పొరేట్ ఆధ్వర్యంలో భదారద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ మేనేజర్ శ్రీనివాస్, జి.రాజేందర్(డిప్యూటీ సూపరింటెండెంట్, జియాలజిస్టు), డి.శిరీష, ఎల్. సరిత (డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సివిల్), జీవీఆర్ కార్తీక్ శర్మ(డిప్యూటీ మేనేజర్), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు వెంకటేష్, వినేష్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ రమ ఏడోరోజు కూర్చున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కోలిండియాలో అధికారులకు అమలుచేస్తున్న పే అప్ గ్రేడేషన్‌ను సింగరేణిలో కూడా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు అందరూ న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇల్లెందు ఏరియాలో కొనసాగుతున్న సింగరేణి అధికారుల దీక్షా శిబిరాన్ని ఆదివారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏడోరోజు రిలే నిరాహార దీక్షలో డీజీఎం పర్సన్ అజ్మీరా తుకారం, ఈఈ ఈఎం దేవేందర్‌నాయక్, సర్వే ఆఫీసర్ జేకేఓసీ ఎస్ శ్రీనివాస్ కూర్చున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపతిగౌడ్ మాట్లాడుతూ అధికారుల సమస్యలను యాజమాన్యం సత్వరమే పరిష్కరించాలని కోరారు.
సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల అధికారులు క్రమశిక్షణతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని అభినందించారు. ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి అధికారులను పరామర్శించారు. మణుగూరు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఏడో రోజు డాక్టర్ సురేష్, డాక్టర్ రమణయ్య, కట్ల శ్రీనివాస్, నాగేశ్వరరావు, సుదర్శన్‌రెడ్డి, కే.శ్రీనివాస్, చింత శ్రీను, హుస్సేన్ పాషా కూర్చున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలోని జీఎం కార్యాలయం ఎదుట దీక్షల్లో కూర్చున్న సింగరేణి అధికారులు మాట్లాడుతూ సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించడంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం దారుణమన్నారు. దీక్షలో అడిషనల్ మేనేజర్ గోపికిషోర్, డిప్యూటీ మేనేజర్ నూకరాజు, సీనియర్ ఇంజినీర్ రవికుమార్ కూర్చున్నారు. గత వారంరోజులుగా సింగరేణిలోని 11 ఏరియాల్లో అధికారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా, ఐక్యంగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు.