కొత్తగూడెం సింగరేణి, మే 12: బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి ఉన్నతికి కృషిచేస్తున్న సంస్థ సీఎండీ ఎన్.బలరాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ బాధ్యులు ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ పురస్కారాన్ని ప్రకటించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఆదివారం సాయంత్రం జరిగిన 25వ జాతీయస్థాయి ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ సీఎండీ బలరాం తరఫున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఐఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
షిల్లాంగ్లో అందుకున్న అవార్డును సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాని, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్లు సోమవారం సింగరేణి భవన్లో సీఎండీకి అందజేశారు. సీఎండీగా బలరాం 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బహుముఖ విస్తరణ కోసం వినూత్న ప్రాజెక్టులు ప్రారంభించారని, కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించారని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒడిశాలో నైనీ ప్రాజెక్టు ప్రారంభానికి చొరవ చూపారని, సంప్రదాయేత ఇంధన వనరుల రంగంలోనూ సింగరేణిని ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.