భద్రాచలం, ఫిబ్రవరి 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏలో ఆదివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించడం సరైనది పద్దతి కాదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుంఆ రమావేది అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీడీఏ పీవో జిల్లా కలెక్టర్ ఈ సమావేశంలో పాల్గొన్నారని అన్నారు. పాలక మండలి సమావేశం గిరిజనుల సమస్యలపైన, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుగా ప్రణాళికలు రూపొందించడం కోసం జరుగుతున్న సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావ్‌ను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ పాటించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేకి ఉందని, కానీ సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోవాల్సి వచ్చిందని ఆదివాసీ ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. కావాలనే కుట్రపూరితంగా తెల్లంను అవమానపర్చారని అన్నారు. ఆదివాసీ ఎమ్మెల్యే కావడంతోనే ఆయన్ను అగౌరవపర్చారని పాలక మండలి, బేషరతుగా ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకొని ఐటీడీఏ సమావేశాలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.