భద్రాచలం, ఫిబ్రవరి 24 : మెనూ కచ్చితంగా పాటిస్తున్నామని, నాణ్యమైన భోజనం పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్నా వేళకు అందని పరిస్థితి నెలకొన్నది. మధ్యాహ్నం దాటిపోయినా భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థినులు ఆకలితో అలమటించారు. విషయం తెలుసుకున్న పీడీఎస్‌యూ నాయకులు వసతి గృహానికి వెళ్లి ప్రిన్సిపాల్, వార్డెన్‌ను నిలదీశారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో సోమవారం చోటు చేసుకుంది.
బీసీ బాలికల వసతి గృహంలో మధ్యాహ్నం దాటిపోయినా విద్యార్థినులకు భోజనం వడ్డించకపోవడంతో విషయం తెలుసుకున్న పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి శివ వసతి గృహానికి వెళ్లారు. భోజనం సరిగా ఉడకలేదనే ఉద్దేశంతో ఆకలితో ఉన్న విద్యార్థినులను గంటలతరబడి ఎండలో నిరీక్షించేలా చేయడంతో ప్రిన్సిపాల్, వార్డెన్‌ను ప్రశ్నించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థినులు ఆకలితో ఇబ్బంది పడుతుంటే వేళకు వడ్డించకుండా వంటలు ఆలస్యమయ్యాయని సాకులు చెబుతారా అని మండిపడ్డారు. దీంతో రోజూ సమయానికే వడ్డిస్తున్నామని, ఈరోజు వంట సిబ్బంది రాకపోవడంతో ఆలస్యమైందని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియాను వసతి గృహం లోపలికి అనుమతించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కాగా.. విద్యార్థినులకు భోజనం వడ్డించే విషయంలో ప్రిన్సిపాల్, వార్డెన్, వంట మనుషులు మధ్య గొడవలు తలెత్తుతున్నాయని, వారి గొడవల కారణంగానే పిల్లలు ఇలా అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ముద్దలుగా ఉన్న అన్నం విద్యార్థినులు ఎలా తింటారని పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి శివ ప్రశ్నించారు. ఐటీడీఏ పీవో, కలెక్టర్ కలుగజేసుకుని పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.