ఖమ్మం సిటీ, డిసెంబర్ 13: స్థానిక పటేల్ స్టేడియంలో 32వ కబడ్డీ సబ్ జూనియర్స్ బాల, బాలికల టోర్నమెంట్ నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లీగ్ పద్దతిలో తొలుత జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో పాలేరు (విన్నర్), వైరా (రన్నర్), బాలికల విభాగంలో పాలేరు (విన్నర్), వైరా జట్లు (రన్నర్)గా నిలిచాయి.
ప్రతిభ కనబరిచిన విజేత జట్లను ఈనెల 16వ తేదీన మంచిర్యాలలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పటేల్ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డి ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిష్టాఫర్, టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీఎస్ఎస్ సాంబమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం నాగప్రసాద్, వీ సత్యనారాయణ, లాలయ్య, సుధాకర్, చిన్నబాబు, శోభన్, రంజాన్ పాల్గొన్నారు.