నవంబర్ 20 : విద్యార్థులు చిన్నతనం నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో బుధవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, మంచి నడవడికను అలవర్చుకోవాలని, అప్పుడు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారన్నారు.
జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. తొలుత భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కలెక్టర్ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ శ్రీనివాసరావు, డీఈవో వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు తదితరులు పాల్గొన్నారు.