Sankranti | భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సరికొత్త లోగిళ్ల సంక్రాంతి రానే వచ్చింది. ఏటా మకర సంక్రమణ నాడు వచ్చే సంక్రాంతి తమ జీవితాల్లో సకల కాంతులనూ నింపుతుందన్నది తెలుగు ప్రజల అభిలాష. అందుకే ఈ పండుగ అచ్చ తెలుగుదనానికి ప్రతీక. ముత్యాల ముగ్గులు, ముంగిళ్లలో గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, బసవన్నల విన్యాసాలు, పిండి వంటల ఘుమఘుమలు, గాలిపటాలతో చిన్నారుల కేరింతలతో ఇల్లంతటినీ సందడితో నింపే సకల శుభాలు వేదిక. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే వేడుక.
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని, గడచిన నెల రోజులుగా కొనసాగిన ధనుర్మాసం ముగుస్తుందని, దీనిని గుర్తుచేసుకుంటూనే సంక్రాంతిని జరుపుకుంటారని పురాణలు చెబుతున్నాయి. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు సరిగ్గా ఇదే సమయంలో చేతికొస్తాయని, ధాన్యపు రాశులు ఇళ్లకు చేరతాయని, అందుకని రైతులందరికీ ఇది విశేషమైన పండుగ అని ప్రతీతి. దీంతో ఇంతటి విశిష్టమైన ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బతుకుదెరువు కోసం దూరప్రాంతాల్లో నివసిస్తున్న ఉమ్మడి జిల్లాలోని పల్లె ప్రజలందరూ ఇప్పటికే తమ సొంతిళ్లకు చేరుకుంటున్నారు. దీంతో మంగళవారం నుంచి 3 రోజుల పాటు ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది.
సంక్రాంతి అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కాబట్టే మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతికి ముందురోజు వచ్చే పండుగ భోగి. సంక్రాంతికి తరువాత రోజు వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ర్టాల్లో వేర్వేరు పేర్లతో పవిత్రంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. ఈ పండుగ సందడి నెల రోజుల ముందుగానే మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు స్వాగతం పలుకుతుంటాయి. వేకువజామున హరినామ కీర్తనలతో హరిదాసులు నెల రోజుల ముందు నుంచే వస్తూ ఉంటారు. గంగిరెద్దులు వచ్చి దీవెనలు అందిస్తూ ఉంటాయి. మొత్తంగా ప్రతి పల్లెలోనూ సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. తెలుగు వారి పెద్ద పండుగ కావడంతో ఈ పర్వదినాన అందరి గృహాలు ఇప్పటికే కొత్త అల్లుళ్లు, బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల నిమిత్తం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు పట్టణాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ పల్లె వాసులు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
భోగ భాగ్యాల భోగి..
మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ భోగి పండుగ చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ పండుగ రోజు ఇంట్లోని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వేకువజామునే నిద్రలేస్తారు. ఇంట్లో ఉన్న పుల్లలు, పాత సామగ్రి, ఆవుపేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అని పిలుస్తారు. ఇక మరో ప్రత్యేకమైనది బొమ్మల కొలువు. ఇది మన పూర్వికుల సంప్రదాయం. వారు వినియోగించిన వస్తువులను ఇప్పటి చిన్నారులు మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పలు రకాల బొమ్మలతో ఈ బొమ్మలకొలువును ఏర్పాటు చేస్తారు. ఈ బొమ్మల కొలువుకు ఇరుగుపొరుగు మహిళలను ఆహ్వానించి హారతి ఇస్తారు. చిన్నారుల తలలపై రేగిపండ్లు పోస్తారు. వీటినే భోగిపండ్లు అంటారు.
సకల కాంతుల సంక్రాంతి..
సంక్రాంతి రోజు వేకువజామునే లేచి స్నానాలు చేసి ఆడబిడ్డలు ఇళ్ల ముందు ముగ్గులు వేస్తుంటే.. పెద్దవాళ్లు ఇంటికి తోరణాలు కడతారు. పనివారికి, ఇతర వృత్తిదారులకు పిండి వంటలను పంచిపెడతారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. కొత్తగా వివాహమైన కుమార్తెను, అల్లుడిని ఇళ్లకు పిలిచి ఘనంగా పండుగ జరుపుకుంటారు. నూతన వస్ర్తాలు అందజేస్తారు. పండుగల అనంతరం వారిని సంతోషంగా పంపుతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున పితృతర్పణాలు కూడా సమర్పిస్తారు. పెద్దలను గుర్తుచేసుకుంటారు.
కనుమ.. ముక్కతినాల్సిందే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేది కనుమ. ఈ పండుగ ఈ రోజున పశువులకు పూజ చేస్తారు. కనుమ అంటే ప్రతీ ఇంట్లో నాటు కోడిని కోసి ఆరగించడం ఆనవాయితీ. అది నేటికీ కొనసాగుతుంది. కనుమ రోజు ఇంటి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లరు. దీని తర్వాత వచ్చే పండుగ ముక్కనుమ. ఈ పండుగకు పల్లెటూళ్లలో మంచి సందడి నెలకొంటుంది. అయితే పట్టణాల్లో ఈ పండుగ ప్రత్యేకతను చాటేందుకు భోగిమంటలు వేయడంతోపాటు ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ.. గాలిపటాల పోటీలను నిర్వహిస్తూ ఉంటారు.
రంగవల్లుల శోభ..
మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి పండుగకు వాకిళ్లు రంగవల్లులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. ఆడబిడ్డలు పోటీపడి మరీ రథం ముగ్గులు వేస్తుంటారు. ఇంటి వాకిళ్లలో గొబ్బెమ్మలను పెట్టి అప్పుడే వచ్చిన పంటలను, ధాన్యాన్ని, ఇళ్లలో పండిన కూరగాయలను ముగ్గులపై ఉంచుతారు. ఇంటికి వచ్చిన డూడూ బసవన్నలకు కూడా ఆహారాన్ని అందించి గోవులను పూజిస్తారు.